అన్న మిస్ చేసుకుంటే చెల్లెలు సొంతం చేసుకుంది
సరైన సమయంలో స్పందించే విషయంలో తన టైమింగ్ కు తిరుగులేదన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు కవిత.;
రాజకీయాల్లో అవకాశాల్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారే ఎదుగుతారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడి.. ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేయటం అంత తేలికైన విషయం కాదు. అధికారంలో చేతిలో ఉన్న వేళ.. సర్కారు ఒక పట్టాన ససేమిరా అనేస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనూ.. తగ్గకపోతే మొత్తానికే నష్టమన్న సంకేతం సర్కారుకు అర్థమయ్యేలా చేయటం చాలా అవసరం. అలా చేసిన నాయకులు తర్వాతి కాలంలో అధికారాన్ని సొంతం చేసుకుంటారు. నాయకుడి దశ నుంచి అధినేత స్టేజ్ కు తీసుకెళ్లేందుకు ఇలాంటి తీరే కారణమవుతుంది.
సరైన సమయంలో స్పందించే విషయంలో తన టైమింగ్ కు తిరుగులేదన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు కవిత. అదే సమయంలో ఆమె సోదరుడు కేటీఆర్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అందివచ్చిన వెలుగుమట్ల వివాదంలో అన్నాచెల్లెళ్లు అయిన కేటీఆర్.. కవితల తీరు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూలో అందరి కంటే ఎక్కువగా హైలెట్ అయ్యింది కవితనే. దీనికి కారణం.. బాధితుల పక్షాన నిలిచి పోరాడాలని డిసైడ్ కావటమే కాదు.. అందుకు ఎంతవరకైనా సరే వెళదామన్నట్లుగా ఆమె తీరు కనిపిస్తుంది.
అందుకు తగ్గట్లే ఖమ్మం వెళ్లిన కవిత.. బాధితులతో కలిసి.. వారితో పాటే.. వారి వద్దే నిరాహార దీక్ష చేపట్టారు. బాధితుల పూరిగుడిసెల్లోనే ఉండి వారికి మద్దతు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేలా చేసింది. అప్పటివరకు కవిత మీద ఉన్న అభిప్రాయం మారేలా చేసింది. ఇదిలా ఉండగా.. తన దీక్షను ఆపే ప్రసక్తే లేదని తేల్చిన కవితను.. అర్థరాత్రి వేళ బలవంతంగా పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయినప్పటికీ తాను దీక్షను కంటిన్యూ చేస్తానని.. ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసే వరకు తన పోరు ఆగదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి చెల్లెలు నేరుగా పోరు చేస్తే.. ఆమె అన్న కేటీఆర్ మాత్రం డిజిటల్ మీడియా.. సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని ప్రభుత్వాన్ని విమర్శించారు. అర్థరాత్రి వేళ గుడిసెల్ని కూల్చివేతలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. పేదల వ్యతిరేక ప్రభుత్వమంటూ ప్రెస్ మీట్లు పెట్టటం.. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు.
అంతేతప్పించి.. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి.. వారితో మమేకమై.. వారికి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వటం.. వారితో కలిసి పోరాడటం లాంటివి చేయలేదు. దీంతో.. కేటీఆర్ కు మించి కవితనే ఈ ఇష్యూలో హైలెట్ అయ్యారని చెప్పాలి. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో బాధితులకు పట్టాలు ఇస్తామని..ఇందిరమ్మ పట్టాలు ఇస్తామని ప్రకటించటంతో.. కవిత పోరుతోనే ఇదంతా సాధ్యమైందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూసినప్పుడు బాధితుల పక్షాన పోరు చేసే తీరు చెల్లెలు దగ్గర అన్న కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలన్న మాట బలంగా వినిపించటం గమనార్హం. ఏమైనా.. ఈ ఎపిసోడ్ తో కవిత ఇమేజ్ భారీగా పెరుగుతుందని చెప్పక తప్పదు. ఈ పరిణామం గులాబీ సైనికులకు ఒక పట్టాన మింగుడుపడే పరిస్థితి ఉండదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.