వెలుగుమట్ల వివాదం ఎప్పుడు మొదలైంది? ఇప్పుడేమైంది?
అసలీ వివాదం ఎప్పుడు మొదలైందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దాదాపు డెబ్భై ఏళ్ల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.;
భవిష్యత్తులో కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానశక్తిగా అవతరించినా.. రాజ్యాంగపరమైన కీలక పదవుల్ని చేపట్టినా.. అందుకు కారణం వెలుగుమట్ల ఇష్యూ పక్కా అవుతుంది. అంతలా ఈ ఇష్యూలో పాలు పంచుకున్నారు. ఇంతకూ ఈ వివాదం ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? అసలీ రచ్చకు కారణమేంటి? నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది? తాజాగా రేవంత్ సర్కారు చేసిన తొందరపాటు చర్యేంటి? ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని చివరకు కళ్లు తెరిచి.. పోతున్న ప్రభుత్వ మైలేజీని తిరిగి సొంతం చేసుకునేలా సీఎం రేవంత్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశారన్న విషయాల్లోకి వెళితే బోలెడన్ని సంగతులు మాత్రమే కాదు.. మరిన్ని అంశాల మీద అవగాహన పెరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.
అసలీ వివాదం ఎప్పుడు మొదలైందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దాదాపు డెబ్భై ఏళ్ల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో భాగంగా 1954-55 ప్రాంతంలో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147-149 సర్వే నెంబర్ల మధ్య సుమారు 62.7 ఎకరాల భూమిని స్థానిక భూస్వామి విరాళంగా ఇచ్చేశారు. ఇంత భారీగా భూమిని ఇచ్చిన ఆ పెద్దమనిషి పేరు కల్వ వెంకట రంగారావు అని కొన్ని రికార్డుల్లో.. మరికొన్ని రికార్డుల్లో రాయల కోటేశ్వరరావు అన్న పేర్లతో ఉంది.
కట్ చేస్తే.. దాదాపు 15 ఏళ్ల క్రితం అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూముల్లో భూమిలేని నిరుపేదలు.. అసంఘటిత కార్మికులు చిన్నపాటి గుడిసెలు.. ఇళ్లను నిర్మించుకన్నారు. వీరున్న ప్రాంతాన్ని వినోభా నవోదయ కాలనీ పేరుతో అక్కడ సెటిల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు భూదాన్ భూములను స్వాధీనం చేసుకొంది. అయితే.. దీనికి సంబంధించిన రికార్డులను పరిశీలించగా.. ఆ పట్టాలు నకిలీవన్న విషయంపై స్పష్టత వచ్చింది. అంతేకాదు.. కొందరికి నిబంధనల విరుద్దంగా కేటాయింపులు జరిగినట్లుగా గుర్తించారు,
2023లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణలో సుమారు 31 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే భూమి చేతికి వచ్చిందో.. అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి కొత్త వాదన మొదలైనట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం కొత్త కలెక్టరేట్ నిర్మానం.. నాగపూర్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనతో ఈ ప్రాంతంలో భూముల ధరలు ఎకరా రూ.8 కోట్లకు చేరిన పరిస్థితి.
దీంతో.. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పేదల ఇళ్లను ఖాళీ చేయిస్తుందన్న వాదనలు బలంగా మొదలయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అదే.. తాజాగా సమస్య పరిష్కారానికి తీసుకొచ్చిందని చెప్పాలి. 2023లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణలో ఉన్న 31 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అనూహ్య రీతిలో ఫిబ్రవరి 24న భారీ పోలీసు బందోబస్తు మధ్య వందలాది ఇళ్లను కూల్చివేయటంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా పెద్దదైంది. దాదాపు 700 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. గతంలో ఈ భూములపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే.. ఈ పట్టాలు నకిలీవిగా.. భూదాన్ రికార్డుల్లో లేవని పేర్కొంటూ అర్థరాత్రివేళలో పెద్ద ఎత్తున ఇళ్లను కూల్చేసింది.
ఈ ఉదంతంపై మిగిలిన వారికి భిన్నంగా కవిత స్పందించారు. ఖమ్మం చేరుకొని బాధితుల్ని నేరుగా కలిసి.. వారి గుడిసెల్లోనే ఉండి.. వారికి మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. బాధితుల ఇళ్లల్లోనే నిరాహార దీక్షను ప్రారంభించారు. దీంతో.. కవిత తీరు హాట్ టాపిక్ గా మారింది. నాటకీయ పరిణామాలతో మార్చి 10 అర్థరాత్రి వేళలో పోలీసులు కవితను బలవంతంగా అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించటమే కాదు.. జాతీయస్థాయిలో ఈ ఇష్యూ గురించి మాట్లాడుకునేలా చేశారు. హైదరాబాద్ కు తరలించిన తర్వాత కూడా తాను దీక్షను చేపడతానని.. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు తన దీక్ష సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
అంతకంతకూ ముదురుతున్న ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంగళవారం సాయంత్రం ఒక సమావేశాన్ని నిర్వహించారు. సుదీర్ఘ చర్చల అనంతరం.. బాధితులకు భూమి పట్టాలు.. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని.. అది కూడా బుధవారం నాడే పూర్తి చేస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేసింది. అంతేకాదు.. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించి ఈ ఇష్యూను క్లోజ్ చేశారు.