కుంభమేళాను మరిపించేలా గోదావరి పుష్కరాలు
ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.;
మరో 18 నెలలలో ఏపీలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసారి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ గత ఏడాదిగా అభివృద్ధి ప్రణాళికతో పనిచేస్తోంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకూ గోదావరి పుష్కరాలను నిర్వహిస్తారు. పన్నెండు ఏళ్ళకు ఒకస్దారి వచ్చే పుష్కరాలకు బడ్జెట్ ని కూడా భారీ స్థాయిలోనే కేటాయిస్తున్నారు.
కోట్లలోనే భక్తులు :
ఏపీలో గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు అని అంచనా వేస్తున్నారు ఏకంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిషా చత్తీస్ ఘడ్ నుంచే కాకుండా తమిళనాడు వంటి చోట్ల నుంచి కూడా వస్తారని అంటున్నారు. అఖండ గోదావరి ఏపీలోనే ప్రవహిస్తుంది కాబట్టి పుష్కర శోభ అంతా అక్కడే ఉంటుందని అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలో గోదావరి పుష్కరాలకు సంబంధిచి ఆరు జిల్లాలలో 373 ఘాట్లు–రాజమండ్రిలో మోడల్ ఘాట్ లని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. అలాగే భక్తుల కోసం టెంట్ సిటీలు హోం స్టేల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది.
పుష్కరాల నిర్వహణపై బాబు సమీక్ష
ఇదిలా ఉంటే గోదావరి పుష్కరాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా సమీక్షను నిర్వహించారు. ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీని కోసం అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కోరారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని బాబు సూచించారు.
తగిన మౌలిక సదుపాయాలు :
ఇక ఏపీలో గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు పది కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని బాబు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో గోదావరి ప్రవహించే 212 కిలోమీటర్ల పొడవునా పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని బాబు స్పష్టం చేశారు. నిధుల కోసం ఇప్పటి నుంచే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.
అత్యధికంగా కోనసీమ జిల్లాలో :
ఇదిలా ఉంటే అత్యధికంగా కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లని నిర్మించాలని చూస్తున్నారు ఇలా మొత్తం కలిపి 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలకు రూపకల్పన చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.