చెప్పేందుకు మీకు విసుగు రాదు.. వినేటోళ్లకు వస్తోంది బాబు

చంద్రబాబు ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆయన తప్పించి..మంత్రులు ఎవరూ పెద్దగా ఫోకస్ కారు.;

Update: 2026-03-14 04:30 GMT

లోపాల్ని సరిదిద్దుకోవటం మంచి నాయకుడి లక్షణం. మొదటిసారి ముఖ్యమంత్రి అయితే.. పాలనా పరమైన అనుభవం సరిగా లేకపోవటం.. అధికార యంత్రాంగాన్ని నడిపే విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు..తన మైండ్ సెట్ కు తగ్గట్లు మంత్రులను ముందుకు వెళ్లేలా చేయటంలో కొంత ఇబ్బందికి గురి కావటం మామూలే. కానీ.. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినట్లుగా మాట్లాడటంతోనే ఇబ్బంది అంతా. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టింది మొదలు.. ఇప్పటివరకు తాను అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఒకేలాంటి సమస్యల్ని ఎదుర్కోవటం కనిపిస్తుంది.

చంద్రబాబు ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆయన తప్పించి..మంత్రులు ఎవరూ పెద్దగా ఫోకస్ కారు. అంతమంది మంత్రులకు.. అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికి.. తమదైన ముద్ర వేసింది కనిపించదు. చంద్రబాబు లాంటి మర్రిచెట్టు ముందు మిగిలిన వారు ఫోకస్ కాగలరా? అంటూ కొందరు దీర్ఘాలు తీస్తుంటారు. ఒకవేళ అదే నిజమైతే.. రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసే వేళలో.. ఆయన తరఫున తమదైన వాదనను బలంగా వినిపించే మంత్రులు ఎందుకు కనిపించరు? అన్నది ప్రశ్న.

తాను మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పాత పద్దతే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఎదుర్కోనంత గడ్డు పరిస్థితిని.. ప్రతికూల పరిస్థితిని జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు.. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. మంత్రులతో సహా ముఖ్యనేతలంతా ఎంత దూకుగుడా వ్యవహరించాలి? జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని తాము ఎంతలా మారుస్తున్నామన్న విషయాన్ని అయినా చెప్పుకోవాలి కదా? కానీ.. అలాంటిదేమీ జరగని పరిస్థితి.

ఎప్పటిలానే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు హితబోధ చేయటం.. ఎలా వ్యవహరించాలో చెప్పాల్సి రావటానికి మించిన దురద్రష్టం ఇంకేం ఉంటుంది? తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు. చాలామంది మంత్రులు తమ శాఖల్లో చేసిన పనులు.. సాధించిన విజయాలు.. చేపట్టిన డెవలప్ మెంట్ యాక్టివిటీస్ ను ప్రజలకు సమర్థంగా చెప్పులేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాను సరైన రీతిలో వినియోగించుకోవటం లేదన్న అసంతృప్తి ని వ్యక్తం చేశారు.

‘‘మీ శాఖల పరిధిలో ఏం చేశామన్నది చెప్పుకోవాలి కదా? వాళ్లు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పటికి కొంత గాడిన పెట్టగలిగాం. మీరు స్పీడ్ పెంచాలి’’ అని చెప్పే మాటల్ని చూసినప్పుడు.. తరచూ ఆయన ఇదే తరహాలో తన ఆవేదనను వ్యక్తం చేయటం.. మంత్రుల్లో మార్పు రాకపోవటం షరా మామూలే అన్నట్లుగా ఉండటం తెలిసిందే. నిజంగానే తాను కోరుకున్న మార్పు రావాలన్న ఆలోచనే చంద్రబాబులో బలంగా ఉంటే.. చాప చుట్టేసినట్లుగా తన అంచనాలకు తగ్గట్లు పని చేయని మంత్రులను పక్కన పెట్టేసి.. కొత్త టీంకు బాధ్యతలు అప్పగించే ప్రయోగం ఎందుకు చేయరు?

అలా అలా చేస్తే.. మిగిలిన వారందరిలోనూ ఒకలాంటి భయం.. కనీసం తమ పదవుల్ని కాపాడుకోవాలన్న అదుర్దా అయినా కలుగుతుంది. అలా జరిగినా.. చంద్రబాబు కోరుకున్న మార్పు వీలవుతుంది. అదేమీ చేయకుండా పదే పదే.. మారాలని చంద్రబాబు చెప్పటం.. మంత్రులు వినటం లాంటివి చంద్రబాబుకు విసుగు కలగకపోవచ్చు. కానీ.. వినేటోళ్లకు.. ఆయన్ను నమ్మి ఓటేసే వారికి.. పార్టీని ప్రాణంగా ప్రేమించే వారికి మాత్రం చిరాకు కలగకమానదు. గత అనుభవాల్ని పాఠాలుగా తీసుకొని మార్పు రాకుంటే.. చంద్రబాబు కోరుకున్న పరిస్థితులు ఉండవన్న కనీస విషయాన్ని ఆయన గుర్తిస్తే బాగుంటుంది. అలాంటివి టీడీపీ అధినేత నుంచి ఆశించటం అత్యాశే అవుతుందా?

Tags:    

Similar News