బయటకు వెళ్లే బదులు హెరిటేజ్ కు రాయితీలు తీసుకోకుంటే బాగుండు
ఇదంతా చూసినప్పుడు.. తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి సంబంధించిన రాయితీల వరకు వెళ్లే కన్నా... వాటిని ఆశించకుండా వదిలేయటమే మంచిది.;
వివాదాలకు దూరంగా ఉండాలా? వద్దా? అన్న విషయంపై సంశయాలు పనికి రావు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పరమపవిత్రంగా ఉన్నప్పటికి.. ఆయా అంశాల్ని రాజకీయ ప్రత్యర్థులు సున్నితంగా వ్యవహరిస్తారని ఆశించటం అత్యాశే అవుతుంది. గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మొదలైన దూకుడు.. ప్రతీకార రాజకీయాలు చంద్రబాబు ఎంత విలువల పరంగా వ్యవహరించినప్పటికి.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేసే విషయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు వెనక్కి తగ్గే తీరు ఉండదు.
అలాంటి వేళలో.. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లాలా? వద్దా? అన్న దానిపై స్పష్టతతో వ్యవహరిస్తే మేలు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీ సంగతే తీసుకుంటే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాసిపెంట్లలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి సంబంధించిన రాయితీలను మంత్రివర్గ ఎజెండాలో పెట్టటం.. అందుకు తగ్గట్లే.. ఆ ఐటమ్ గురించి చర్చకు వచ్చినప్పుడు.. ఆ సంస్థ చంద్రబాబు కుటుంబ సభ్యులది కావటంతో.. ఆ సమయంలో ఆయన.. ఆయన కొడుకు కం రాష్ట్ర మంత్రి లోకేశ్ బయటకు వెళ్లిపోయారు.
ఇప్పుడున్న కాలంలోనూ ఈ తరహా సంప్రదాయాన్ని ప్రదర్శించటం గొప్పే అవుతుంది. అయినప్పటికీ.. చంద్రబాబును.. ఆయన కమిట్ మెంట్ ను ఆయన రాజకీయ ప్రత్యర్థులు గుర్తించి.. చంద్రబాబును..ఆయన కుమారుడు లోకేశ్ ను అభినందించటం లాంటివి ఏమీ ఉండవు. దానికి బదులుగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఇదంతా చూసినప్పుడు.. తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి సంబంధించిన రాయితీల వరకు వెళ్లే కన్నా... వాటిని ఆశించకుండా వదిలేయటమే మంచిది.
ఆర్థికంగా కాస్తంత ఇబ్బంది అయినప్పటికీ.. దానిని భరించేఉద్దేశం ఉంటేనే చేయాలే తప్పించి..ఇలా మంత్రివర్గంలో ఇంత పద్దతి ప్రకారం చేసినప్పటికీ దాని వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. మనం ఎంత పద్దతి ప్రకారం నడిచినా.. ఎదుటోడికి అవేమీ లేనప్పుడు.. ఆ జోలికి వెళ్లే కన్నా.. దూరంగా ఉండటం మంచిది. అలాంటప్పుడు కాస్తంత ఆర్థిక భారం పడుతుంది. ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవటం ఇష్టం లేనప్పడు.. ఆర్థిక భారాన్ని మోయటమే మంచిదని చెప్పాలి. అందుకు భిన్నంగా.. ఇప్పుడు చేసిన తరహాలో రాయితీలు తీసుకున్నా.. తర్వాతి రోజుల్లో ఖాయంగా నిందలు మోయటం.. ఆ తర్వాతి కాలంలో ఇప్పుడు చేసుకున్న ఒప్పందాల వెనుక భారీ స్కాంలు జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కోవటం.. తన శీలాన్ని ఫ్రూవ్ చేసుకోవాల్సి రావటం లాంటివి అవసరమా చంద్రబాబు?