7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నలు.. ముగిసిన కేటీఆర్ SIT విచారణ.. వాంగ్మూలం నమోదు
సిట్ విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు “కాలక్షేప కథాచిత్రాలు” నడుపుతోందని విమర్శించారు.;
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై జరిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ముగిసింది. సుమారు 7 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. విచారణ అనంతరం కేటీఆర్ జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. కేసు నమోదై దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు.
విచారణ అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలు..
సిట్ విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు “కాలక్షేప కథాచిత్రాలు” నడుపుతోందని విమర్శించారు. “సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను ప్రశ్నించాను. ఇది లీకుల మీద నడిచే ప్రభుత్వం” అని ఆయన అన్నారు.
హీరోయిన్ల పేర్లతో తనపై దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్న కేటీఆర్, ఆ విషయంపై సిట్‌ను ప్రశ్నించగా “మేము అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని” అధికారులు స్పష్టం చేశారని తెలిపారు. అడ్డగోలు లీకులను నమ్మి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. “మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి” అని అన్నారు.
అదేవిధంగా “ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?” అని సిట్‌ను ప్రశ్నించానని.. ఏ నటులు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాలేదని చెప్పారు. “ఈరోజు నన్ను ఎవరితోనూ కలిపి విచారించలేదు. ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావూ’ లేరు. మరోసారి పిలిస్తే తప్పకుండా వస్తాను” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో సిట్ మరిన్ని కీలక విచారణలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.