అయ్య‌న్న వ‌ర్సెస్ వైసీపీ.. ట‌గ్ ఆఫ్ వార్‌..!

దీంతో ఇరు ప‌క్షాల న‌డుమ స‌భా వ్య‌వ‌హారాల‌కు సంబంధించి .. ట‌గ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. ఎప్ప‌టికప్పుడు .. ఇది చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది.;

Update: 2026-01-23 16:30 GMT

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి ప‌ట్టు.. ఇదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యేల బెట్టు.. రెండూ కూడా ఆస‌క్తిగానే ఉన్నాయి. స‌భ‌కు రాబోమంటే రాబోమ‌ని వైసీపీ శాస‌న స‌భ్యులు, మీరు ఎలా రారో చూస్తామంటూ ఇటు స్పీక‌ర్‌.. మొత్తానికి `ట‌గ్ ఆఫ్ వార్‌` అన్న‌ట్టుగా కొన‌సాగుతోంది. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. అయితే.. అప్ప‌టి నుంచి కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే 11 మంది స‌భ్యులు స‌భ‌కు హాజ‌ర‌య్యారు.

తొలిసారి ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు.. రెండో సారి బ‌డ్జెట్ స‌మావేశాల‌కు.. మాత్ర‌మే వైసీపీ స‌భ్యులు వెళ్లారు. ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ వంక చూసింది లేదు అయితే.. వీరిలో ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌.. మిగిలి న 10 మంది వేత‌నాలు తీసుకుంటున్నార‌ని.. స‌భ‌కు రాకుండా వేత‌నాలు తీసుకోవ‌డం ఏంటి? అనేది స్పీకర్ వాద‌న‌. మీరు.. సీఎంకు ఎంత స‌మ‌యం మాట్లాడేందుకు ఇస్తే.. అంత స‌మ‌యం మాకు ఇస్తే.. మేం వ‌స్తామ‌ని వైసీపీ బెట్టు చేస్తోంది.

దీంతో ఇరు ప‌క్షాల న‌డుమ స‌భా వ్య‌వ‌హారాల‌కు సంబంధించి .. ట‌గ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. ఎప్ప‌టికప్పుడు .. ఇది చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది. అసెంబ్లీ ప్రారంభానికి ముందు ఇదో పెద్ద చ‌ర్చ‌గా తెర‌మీదికి కూడా వ‌స్తోంది. కానీ.. స‌మ‌స్య మాత్రం కొనసాగుతోంది. ఇటు స్పీక‌ర్, అటువైసీపీ ఎక్క‌డా మెట్టు దిగ‌డం లేదు. మీకు సంఖ్యాబ‌లం లేదు కాబ‌ట్టి మాట్లాడేందుకు పెద్ద‌గా అవ‌కాశం ఇచ్చేది లేద‌ని తెగేసి చెబుతున్నారు. ఈ స‌మ‌యంలోనే.. స‌భ్యుల జీతాల‌ను తెగ్గోసే అంశంపై నిశితంగా ప‌రిశీలిస్తున్నారు.

కానీ, దీనికి ఎక్క‌డా ప్రొవిజ‌న్‌లేదు. ఈ విష‌యాన్ని తాజాగా స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఒప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంపై ఆయ‌న కేంద్రానికి కూడా విన్న‌వించారు. ఇది కూడా సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఎందుకంటే.. చాలా రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్ ఇప్ప‌టికి రెండు సార్లు మాత్ర‌మే(2 సంవ‌త్స‌రాల్లో) వెళ్లారు. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు.. బెంగాల్ స‌హాప‌లు రాష్ట్రాల్లో ఇదే కొన‌సాగుతోంది. మొత్తంగా చూస్తే.. ఏపీలో ఈ వివాదం తెగ‌దు.. సాగ‌దు అన్న‌ట్టుగానే ఉంది.

Tags:    

Similar News