వివేకా గుండె పోటు స్క్రిప్ట్ సునీతమ్మదే !
మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి ఏడేళ్ళు పూర్తి అయ్యాయి. నిందితులు ఎవరో తేలలేదు.;
మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి ఏడేళ్ళు పూర్తి అయ్యాయి. నిందితులు ఎవరో తేలలేదు. అయితే ఈ కేసు రాజకీయంగా మాత్రం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. కడప జిల్లాలో వైఎస్సార్ కుటుంబంలోని ప్రముఖ వ్యక్తిగా ఉన్న వివేకా మర్డర్ కేసులో ఏవి నిజాలు ఏవి నిందలు అన్నవి తేలకపోవడం ఒక చర్చ అయితే ఆ కుటుంబం రెండుగా విడిపోయి ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం రాజకీయంగా విచిత్రమైన పరిణామం. ఈ కేసు విషయంలో ఇక విచారణ చేసేది ఏమీ లేదని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలియచేసిన తరువాత ట్రయల్ ని నాలుగు వారాలలో చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఘాటు విమర్శలతో :
ఈ క్రమంలో వివేకానందరెడ్డి ఏడవ జయంతి మార్చి 15 జరిగింది ఈ సందర్భంగా ఆయన అకుమార్తె సునీత తన తండ్రి హత్య కేసులో సరైన న్యాయం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు సంతృప్తికరంగా లేదని అన్నారు. తాను అయినా సరే ప్రయత్న లోపం లేకుండా మరింతగా పోరాడుతాను అని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సునీత కామెంట్స్ మీద రివర్స్ లో కౌంటర్ చేశారు. వివేకా విషయంలో ఆయన కుమార్తె సునీత వైసీపీ మీద అనుమానాలు వ్యక్తం చేయడం దారుణం అని వారు అంటున్నారు.
గుండెపోటు సృష్టించిందే వారు :
ఇక వైఎస్ వివేకా మరణాన్ని గుండె పోటుగా సృష్టించిందే ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ అని కడప ఎంపీ వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సునీత అక్క ఇదే విషయాన్ని సునీత 2019 మార్చి 16న సిట్ కి ఇచ్చిన స్టేట్మెంట్ లోనే స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ఆమె ఆమె భర్త ఇద్దరూ గుండె పోటు అని స్టేట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు. పైగా వివేకా హత్య కేసులో అనేక కీలక అంశాలను కూడా ఆమె పక్క దోవ పట్టించారని ఆయన అంటున్నారు.
నన్ను టార్గెట్ చేశారు :
ఈ కేసులో తనను సునీత టార్గెట్ చేశారని తన మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని ఆమె కొందరి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసారని ఆయన ఆరోపించారు తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని దీనికి సీబీఐ కూడా సమాధానం చెప్పాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు మర్డర్ ఫర్ గెయిన్ అన్న కోణంలో విచారణ జరిపించాలని సునీత ఎందుకు సీబీఐని కోరడం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు వివేకా హత్య గురించి పోలీసులకు తొలుత సమాచారం ఇచ్చిందే తాను అని ఆయన అన్నారు
సీబీఐ ఏకపక్షంగానే :
అసలు ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అంశాలను వదిలేసి సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది అని అవినాష్ రెడ్డి విమర్శించారు. రాం సింగ్ అనే అధికారి విచారణాధికారిగా వచ్చాక కేసు పూర్తిగా తప్పుదోవ పట్టిందని ఆయన అన్నారు. సీబీఐ డైరెక్టర్ కి అనేక ఆధారాలు ఈ కేసు విషయంలో తాను సమర్పించాను అని విచారణ ఆ దిశగా చేయాలని కోరినా పట్టించుకోలేదని అవినాష్ రెడ్డి చెప్పారు సీబీఐ తనకు నచ్చిన వారిని మాత్రమే విచారణ చేసిందని అందుకే ఏకపఖంగా దర్యాప్తు సాగింది అని ఆయన విమర్శించారు.
రాజకీయంగా బాబు:
వివేకా మర్డర్ కేసుని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు అని అవినాష్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. నిజానికి చూస్తే చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య కేసు జరిగింది అని ఆయన అన్నారు. ఈ హత్య జరిగిన మూడు నెలల పాటు బాబు సీఎం గా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అయినా సరే ఈ కేసుని తమ మీదకు తోసి రాజకీయంగా వాడుకుంటున్నారు అని అన్నారు ఈ కేసుతో వచ్చే ఎన్నికల దాకా అయినా సాగదీసి రాజకీయంగా వాడుకోవాలని బాబు చూస్తున్నారు అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలోనే సునీత బయటకు వస్తారని టాపిక్ డైవర్షన్ లో ఇదంతా భాగమని ఆయన విమర్శలు గుప్పించారు. సునీత సైతం రాజకీయ లబ్ధి కోసమే ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు.
ఇవన్నీ విచారించాలి :
అసలు వివేకానందరెడ్డిని ఆయన కుటుంబం వదిలేసింది అని అవినాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు అంతే కాదు సునీత మేనమామ శివ ప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేకా గుండె పోటుతో చనిపోయారు అని చెప్పారని ఆయన తెలిపారు ఈ గుండె పోటు థియరీ అంతా సునీత వారి కుటుంబ సభ్యులదే అని అవినాష్ రెడ్డి తేల్చేశారు. వివేకా చెక్ పవర్ ని తీసేశారు అని, ఆయనకు షమీం అనే ఆమెకు ఉన్న సంబంధాలు అలాగే వారికి పుట్టిన కొడుకుకు ఆస్తులు పోవద్దనే ఈ హత్య చేసి ఉంటారన్న కోణంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయదని ఆయన ప్రశ్నించారు ఈ అంశాల మీద విచారణ జరిపించాలని ప్రధానికి హోం మంత్రికి తాను లేఖలు రాశాను అని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.