సీఐ నాగ‌రాజుపై హత్యాయ‌త్నం కేసు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేష‌న్ సీఐగా ప‌నిచేసి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న నాగ‌రాజుపై విజయ‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు.. ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

Update: 2026-06-19 10:07 GMT

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేష‌న్ సీఐగా ప‌నిచేసి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న నాగ‌రాజుపై విజయ‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు.. ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. దీనిలో ప్ర‌ధానంగా హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల యువ‌కుడు సాయికృష్ణ అదృశ్యం కేసు అనేక మ‌లుపులు తిరిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సీఐ నాగ‌రాజు తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదు ర్కొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ ఏకంగా ఈ కేసును సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేసింది. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన ప్ర‌భుత్వం రాజ‌మండ్రి ఎస్పీ కిశోర్‌తో విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇంత‌లోనే ఈ కేసు మ‌రింత తీవ్ర‌త‌రం కావ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జిల్లా పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్‌బాబు.. బాధితుడి ఇంటికి వెళ్లి సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి నుంచి వాంగ్మూలం న‌మోదు చేసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే సీఐ నాగ‌రాజుపై విజ‌య‌ల‌క్ష్మి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలిసింది.``నీ కొడుకును చంపేస్తా. ఫొటోకు దండ‌లు వేసుకో`` అని నాగ‌రాజు బెదిరించిన‌ట్టు ఆమె చెప్పారు. దీంతో నాగ‌రాజుపై బీఎన్ఎస్ చ‌ట్ట‌లోని సెక్ష‌న్లు.. 127(4), 127(6), 103(1), 238ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించా రు. వీటిలో 103(1) హ‌త్యాయ‌త్నం సెక్ష‌న్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇత‌ర సెక్ష‌న్లు కూడా బ‌లంగానే ఉన్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ సెక్ష‌న్లు..

బీఎన్ ఎస్ 127(4): 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించే తీవ్రమైన నేరానికి సంబంధించినది. నిర్ణీత పరిధిలో దీర్ఘకాలం పాటు చట్టవిరుద్ధంగా వ్య‌క్తిని నిర్బంధించ‌డం.

బీఎన్ ఎస్ 127(6): ఒక వ్య‌క్తిని రహస్యంగా అక్రమ నిర్బంధంలో ఉంచి హింసించ‌డం. ఆ వ్యక్తి నిర్బంధం లేదా ఆ నిర్బంధ స్థలం తెలియకుండా ఉంచ‌డం. ఒక వ్యక్తి కదలికలను చట్టవిరుద్ధంగా నియంత్రించ‌డం.

బీఎన్ ఎస్ 103(1): ఒక వ్య‌క్తిని హ‌త్య చేసేందుకు పుర‌మాయించ‌డం. హత్యాయత్నం. ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 302 కి సమానం. ఇది నిరూపిత‌మైతే.. జీవిత ఖైదు కు దారి తీస్తుంది.

బీఎన్ ఎస్ 238: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం. నేరాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం.

Tags:    

Similar News