35 ఏళ్ల అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్ ఫోర్స్ వన్’కు వీడ్కోలు!

అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందిన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ (వీసీ-25ఏ) తన 35 ఏళ్ల సుదీర్ఘ సేవలకు ముగింపు పలికింది.

Update: 2026-06-19 13:30 GMT

అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందిన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ (వీసీ-25ఏ) తన 35 ఏళ్ల సుదీర్ఘ సేవలకు ముగింపు పలికింది. బోయింగ్ 747–200 ఆధారంగా రూపొందించిన ఈ దిగ్గజ విమానం రిటైర్మెంట్ ప్రకటించడంతో అమెరికా అధ్యక్ష విమానాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దౌత్యానికి, వ్యూహాత్మక భద్రతకు చిహ్నంగా నిలిచిన ఈ విమానం స్థానంలో సరికొత్త సాంకేతికతతో కూడిన కొత్త తరం విమానాలు రానున్నాయి.

'ఫ్లయింగ్ వైట్ హౌస్' ప్రత్యేకతలు

ఈ విమానం కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. గాల్లో ప్రయాణించే ఒక అత్యాధునిక కమాండ్ సెంటర్. అందుకే దీనిని ‘ఫ్లయింగ్ వైట్ హౌస్’ అని పిలుస్తారు. దీని ప్రత్యేకతలు ఇవే విమానంలో అధ్యక్షుడి కోసం ప్రత్యేక కార్యాలయం, కాన్ఫరెన్స్ హాల్, మెడికల్ సెంటర్ ,అత్యవసర ఆపరేషన్ థియేటర్ సౌకర్యాలు ఉన్నాయి. అత్యంత సురక్షితమైన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అధ్యక్షుడు గాల్లో నుంచే పెంటగాన్, వైట్ హౌస్ , అణు కమాండ్ కేంద్రాలతో నేరుగా అనుసంధానం కాగలరు. అత్యవసర పరిస్థితుల్లో భూమిపై ల్యాండ్ అవ్వకుండానే గాల్లోనే ఇంధనాన్ని నింపుకుని, రోజుల తరబడి ప్రయాణించే అద్భుత సామర్థ్యం దీని సొంతం.

అజేయమైన రక్షణ వ్యవస్థ

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానంగా దీనికి పేరుంది. శత్రు దేశాల క్షిపణి దాడులను ముందే పసిగట్టే రాడార్ హెచ్చరిక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ జామింగ్ పరికరాలు, హీట్ సీకింగ్ మిస్సైళ్లను తప్పుదారి పట్టించే ప్రత్యేక ఫ్లేర్ సాంకేతికత ఇందులో ఉన్నాయి.

చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యం

1980ల చివరలో సేవల్లోకి వచ్చిన ఈ నీలం-తెలుపు రంగుల విమానం జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ నుంచి జో బైడెన్ వరకు పలువురు అమెరికా అధ్యక్షుల చారిత్రక పర్యటనలకు వేదికైంది. ముఖ్యంగా 9/11 ఉగ్రదాడుల సమయంలో దేశ భద్రతను పర్యవేక్షించడంలో అంతర్జాతీయ సంక్షోభాల వేళ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ విమానం అగ్రరాజ్యానికి ప్రధాన ఆసరాగా నిలిచింది.

కొత్త అధ్యాయం: వీసీ-25బి రాక

ఈ చారిత్రక విమానం భవిష్యత్తులో మ్యూజియంలో ప్రదర్శనకు వెళ్లే అవకాశం ఉంది. దీని స్థానాన్ని భర్తీ చేస్తూ బోయింగ్ 747-8 ఆధారంగా రూపొందుతున్న సరికొత్త వీసీ-25బీ విమానాలు త్వరలోనే సేవల్లోకి రానున్నాయి. కొత్త తరం విమానాలు మరింత మెరుగైన ఇంధన సామర్థ్యం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలు, అధునాతన రక్షణ వ్యవస్థలతో రాబోతున్నాయి. ఏదేమైనప్పటికీ గత మూడున్నర దశాబ్దాలుగా అమెరికా ప్రతిష్ఠను, సైనిక శక్తిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' సేవలు ప్రపంచ దౌత్య చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

Tags:    

Similar News