పొలిటికల్ డిబేట్: సాయి రెడ్డి సొంత పార్టీ పెడతారా?
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.;
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన వైసీపీలో ఉండగా.. 2019 ఎన్నికలను తన కనుసన్నల్లోనే నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సభ్యుడిగానే అయినా.. కేంద్రంలో అన్నీ తానై ఆ పార్టీ తరఫు న చక్రం తిప్పారు. ఆ తర్వాత విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్‌గా ఆయన చేసిన కృషి నిజంగా నే పార్టీని బలోపేతం చేసింది.
కానీ, అంతర్గత విభేదాలు, పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించడంతో ఏర్పడిన వివాదాలతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా సాయిరెడ్డి మీమాంసలో పడ్డారు. వ్యవసాయం చేసుకుంటానని రాజకీయాల్లోకి రానను తొలినాళ్లలో చెప్పినా.. ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడిన తర్వాత.. దానిని వదులుకోవడం అంత తేలిక కాదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రాజకీయ పునరాగమనంపై కీలక ప్రకటన చేశారు. ఏ పార్టీలోకి వస్తాను.. అనేది త్వరలోనే చెబుతానన్నారు. అయితే.. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సొంతగా పార్టీ పెట్టే అవకాశం ఉందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో దేనిలో చేరినా.. ఆయన అభిప్రాయాలకు.. మనస్తత్వానికి సరిపోయే పార్టీ లేదు.
పైగా సాయిరెడ్డి స్థాయిలో ఆయనకు పదవి ఇచ్చేందుకు కూడా ఏ పార్టీ సాహసిస్తుందన్నది ప్రశ్న. పోనీ.. ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారా? అంటే.. అవమానం జరిగిందని భావిస్తున్న పార్టీలోకి వెళ్లే సాహసం సాయిరెడ్డి చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో సొంతగా పార్టీ పెట్టే ఆలోచన చేయొచ్చని మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. మరికొందరు మాత్రం సాయిరెడ్డి జనసేన వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.