విశాఖకు రింగ్ రోడ్డు...భారీ గిఫ్ట్ !
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖ రావాలంటే హెవీ ట్రాఫిక్ ఉంది. దాంతో గంటన్నరకు పైగా సమయం పడుతోంది.;
ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీస్ లో విశాఖ ముందు వరసలో ఉంది. దానికి భౌగోళికమైన పరిస్థితులు కారణం. విశాఖకు అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. పచ్చని కొండలు ఉన్నాయి. ప్రకృతి రమణీయత ఉంది. అలాగే రూరల్ అర్బన్ రెండూ కలగలసిన నేపథ్యం ఉంది. సీ పోర్టు ఎయిర్ పోర్టు రైల్వే రోడ్ కనెక్టివిటీ ఉండడంతో ఏపీలో ప్రస్తుతం అతి పెద్ద నగరంగా ఉంది. విశాఖను ఎవరూ విస్మరించలేని విధంగా సిటీ ప్రగతి ఉంది. ఐటీ హబ్ గా పారిశ్రామిక ముఖ్య కేంద్రంగా విశాఖ అవతరిస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు ఆపరేషన్స్ మొదలైతే కనుక విశాఖ అభివృద్ధి మరింతగా జోరు అందుకుంటుంది అన్న మాట సైతం గట్టిగా వినిపిస్తోంది.
రింగ్ రోడ్ ప్లాన్ తో :
విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రింగ్ రోడ్ కి ప్లాన్ చేస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి రాంబిల్లి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ వరకూ దాదాపుగా 70 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతం వరకూ రింగ్ రోడ్ ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అని అంటున్నారు. ఈ రింగ్ రోడ్ పరిధిలోకి భోగాపురం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం రాంబిల్లి వస్తాయి.
ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలంటే :
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖ రావాలంటే హెవీ ట్రాఫిక్ ఉంది. దాంతో గంటన్నరకు పైగా సమయం పడుతోంది. దాంతో ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలంటే రింగ్ రోడ్ అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో కొత్తగా ప్లాన్ చేస్తున్న రింగ్ రోడ్ అంతా రూరల్ రూట్ లో సాగుతుంది. దాంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పధంలోకి వస్తాయని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలు సైతం అభివృద్ధి చెందేందుకు ఈ విధంగా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ రింగ్ రోడ్ ప్రగతికి అతి పెద్ద కీలకమైన మలుపుగా ఉంటుందని కూడా భావిస్తున్నారు.
రియల్ బూమ్ సైతం :
ఇక ఈ రింగ్ రోడ్ డిజైన్ చేసిన తీరుని బట్టి చూస్తే రూరల్ సెక్టార్ అంతా మహర్దశను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు రానున్న రోజులలో మారు మూలన ఉన్న ప్రాంతాలు సైతం మెయిన్ జంక్షన్లుగా మారుతాయని అంటున్నారు. అలా రియల్ బూమ్ ఊపందుకుంటుంది అని లెక్క వేస్తున్నారు. అదే సమయంలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా వీలు కల్పిస్తుందని అంటున్నారు. ఒక విధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికే ఈ రింగ్ రోడ్ పరిమితం కాదని బహుముఖంగా అభివృద్ధికి బాటలు వేస్తుందని భావిస్తున్నారు.
భోగాపురం టూ రాంబిల్లి :
భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి రాంబిల్లి దాకా రింగ్ రోడ్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వడం వల్ల రాంబిల్లి ప్రాంతంలో ఉన్న రక్షణ కేంద్రాలు అలాగే పారిశ్రామిక సంస్థలకు కూడా ఎయిర్ పోర్టుని అనుసంధానించినట్లు అవుతుందని చెబుతున్నారు. అంతే కాదు ఐటీ ఫార్మా సెక్టార్ తో పాటు పారిశ్రామిక రంగానికి ఈ రింగ్ రోడ్ అతి పెద్ద బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు. అపుడు విశాఖ నగరం వైపు ట్రాఫి తగ్గి రింగ్ రోడ్ మెయిన్ రూట్ అవుతుందని ఆ విధంగా సిటీ మీద ఒత్తిడి తగ్గుతుందని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖకు రింగ్ రోడ్ రూపంలో ఒక భారీ గిఫ్ట్ ని కూటమి ప్రభుత్వం రెడీ చేస్తోంది అని చెబుతున్నారు.