జైలుకు పంపితే వెళ్లొద్దాం.. మాజీ మంత్రి కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ శ్రేణులకు సూచించారు.

Update: 2026-08-05 04:44 GMT

వచ్చే స్థానిక ఎన్నికలపై వైసీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఈ విషయమై నియోజకవర్గాల వారీగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో మాజీ మంత్రి కొడాలి నాని సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువగా హైదరాబాద్ లోనే గడుపుతున్న మాజీ మంత్రి స్థానిక ఎన్నికల నేపథ్యంలో గుడివాడలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం సూచనలతో ప్రత్యేకంగా సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, స్థానిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారం చేద్దామని సూచించారు. ఇక పోటీ చేసిన వారిని భయపెట్టేలా కేసు పెట్టొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. అలా చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని కార్యకర్తలను సన్నద్ధం చేశారు.

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ శ్రేణులకు సూచించారు. అధినేత జగన్ కూడా ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించినా, భయపడొద్దని భరోసా ఇచ్చారు. జైలుకు పంపితే ఆర్నెళ్లు వెళ్లొద్దామని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.

దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత నెలకొందని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. సోమవారం ఉత్తరభారత్ లోని మూడు రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రెండు చోట్ల ఓడిపోయిందని, గుజరాత్ లో మెజార్టీ లక్ష ఓట్ల నుంచి 30 వేలకు తగ్గిపోయిందని గుర్తు చేశారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. కూటమి నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. సూపర్ సిక్స్ సూపర్ సున్నా చేశారని, మహిళలకు రూ.1500 ఇస్తామని అమలు చేయలేదని ఆరోపించారు.

నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, 20 లక్షల ఉద్యోగాలు అంటూ మోసం చేశారని మాజీ మంత్రి మండిపడ్డారు. మొత్తానికి కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేయడం ద్వారా మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ దూకుడుగా రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగుసార్లు గెలిచిన గుడివాడ స్థానాన్ని గత ఎన్నికల్లో కోల్పోయిన నాని స్థానిక ఎన్నికల ద్వారా తిరిగి పుంజుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. గుడివాడ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గాలితో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారని భావిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని, తన పట్టు ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపి ప్రత్యర్థుల జోరుకు బ్రేకులు వేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే మూడు నెలలు ముందుగానే నియోజకవర్గంలో రాజకీయం స్టార్ట్ చేశారని భావిస్తున్నారు.

Tags:    

Similar News