'అధ్యక్ష పదవే' యువతకు ఇచ్చేయండి .. సాయిరెడ్డి పై మీమ్స్.. !
| విజయసాయిరెడ్డి ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)పై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వైరల్ అవుతున్నాయి. సీఎం కావాలనే ఆశ లేదని, యువతకు అవకాశం ఇస్తానన్న ఆయన వ్యాఖ్యలపై ముందుగా పార్టీ అధ్యక్ష పదవినే యువతకు ఇవ్వాలంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. పార్టీ పేరు, జెండాలోని కాషాయ రంగుపైనా కామెంట్లు చేస్తున్నారు.
నాయకులు చేసే వ్యాఖ్యలపై రాజకీయ నేతలో..లేక ప్రత్యర్థులో కౌంటర్లు వేయాలనేం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రజలు, ఒకింత పరిజ్ఞానం ఉన్నయవత కూడా స్పందిస్తున్నారు. వారే కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృతంగా మీమ్స్ సెటైర్లు వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన ప్రకటనలపై నెటిజన్లు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.
పార్టీ ఆవిర్భావ సభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని, రెండు కుటుంబాల పాలనకు స్వస్తి పలికి అన్ని సామాజిక వర్గాల నుండి నాయకత్వ లక్షణాలున్న యువతను ఎన్నుకుని సీఎం ను చేయాలని వ్యాఖ్యానించారు. దీనికి కొందరు కౌంటర్ ఇచ్చారు. ముందు యువతను పెట్టి.. తెరవెనుక చక్రం తిప్పాలని అనుకున్నారా సర్! అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరికొందరు ఎలానూ తానే సీఎం ఫేస్ అంటే కష్టమని.. యూత్ స్లోగన్ అందుకున్నారని చెబుతున్నారు.
మరికొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ముందుగా కొత్త పార్టీ అధ్యక్ష పదవినే యువతకు ఇచ్చేయండి సార్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అప్పుడు నిజంగానే సాయిరెడ్డిని నమ్మ వచ్చని అన్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి కంటే కూడా.. యువతను పెట్టి.. అది కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచి ఎంపిక చేయాలని అన్నవారు ఎక్కువగా ఉన్నారు. కావాలంటే.. సాయిరెడ్డి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండొచ్చని అన్నవారు కూడా ఉన్నారు.
మరోవైపు.. పార్టీ పేరు( పీఆర్పీ) పై కూడా ట్రోల్స్ బాగానే జరుగుతున్నాయి. సాయిరెడ్డి ప్రకటించిన పార్టీ పేరు సంక్షిప్త రూపం పీ-ఆర్-పీ(పరివర్తన రాజనీతి పార్టీ) కావడంతో, గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పోలుస్తూ కూడా పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చిరంజీవి పేరును పరోక్షంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకొందరు పార్టీ జెండాలో కాషాయంపై కూడా కామెంట్లు కుమ్మరించారు. ``సాయిరెడ్డి గారు ఎవరికి బీ టీమో.. అర్థమైపోయింది!. `` అంటూ.. మెజారిటీ నెటిజన్లు చెప్పుకొచ్చారు. కానీ, పార్టీ పేరును మాత్రం చెప్పలేదు.