2028లో తెలంగాణ ఎన్నికలు ఉండవా? సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.;

Update: 2026-03-18 10:31 GMT

తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు జరగనున్నందున, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు వాయిదా పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి మాట్లాడారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు సంబంధించిన డ్రగ్స్ కేసుపైనా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ దిశగా కేంద్రం అడుగులు వేయనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడేళ్లలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగనున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో హాట్ డిబేట్ కు తెరతీసినట్లైందని అంటున్నారు.

జమిలి ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో ఆరు నెలలు బోనస్ గా వచ్చినట్లే చెబుతున్నారు. విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తన పదవీకాలంలో ఆరు నెలలు వదులుకుని ఎన్నికలకు వెళితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆరు నెలల కాలం కలిసివచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిలు ఇచ్చి పంపేయడంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీనిపై తాజాగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై సిట్ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిలు ఇవ్వడంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. తన సన్నిహితుడు, కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన వేంనరేందర్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేతలకు పరిచయం చేశారు.

Tags:    

Similar News