‘డ్ర*గ్స్‌, హీరోయిన్ల’ ఆరోపణలపై కేటీఆర్‌ స్పష్టీకరణ

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు.;

Update: 2026-01-23 12:12 GMT

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తనపై వస్తున్న డ్ర*గ్స్ మరియు హీరోయిన్ల సంబంధాల ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.

వ్యక్తిత్వ హననమే లక్ష్యం: కేటీఆర్ మండిపాటు

గడిచిన రెండేళ్లుగా తనపై ఉద్దేశపూర్వకంగా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఎప్పుడూ చట్టవిరుద్ధంగా గానీ అనైతికంగా గానీ ప్రవర్తించలేదు. నా మనస్సాక్షి చాలా స్పష్టంగా ఉంది. డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయంటూ నిరాధారమైన వార్తలు ప్రచారం చేసి నన్ను, నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవన్నీ రేవంత్ రెడ్డి 'డైవర్షన్ పాలిటిక్స్'

రాష్ట్రంలో పాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి 'డ్రామాలు' ఆడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా-ఈ రేస్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్.. ఇలా రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రతిపక్షాలను వేధిస్తున్నారని, అటువంటి వారిని భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. "రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని ఏ అధికారి అయినా గ్యారెంటీ ఇవ్వగలరా?" అని ఆయన సవాల్ విసిరారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. విచారణను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ, ఓయూ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. కేసీఆర్, కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వారు నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

విచారణకు పూర్తి సహకారం

సిట్ విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, అయితే ఇదే సమయంలో పోలీసులను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతానని కేటీఆర్ పేర్కొన్నారు. "మా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో, ఆధారాలు ఏంటో వివరాలు అడుగుతాను. తప్పు చేసిన వాళ్లే భయపడతారు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా సిద్ధం," అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును ఇప్పటికే సిట్ అధికారులు విచారించిన తరుణంలో ఇప్పుడు కేటీఆర్ విచారణకు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




Tags:    

Similar News