ఎన్నికల ఎఫెక్ట్: 'చే' జేతులా చేసుకుంటున్న కాంగ్రెస్!
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్‌డీఎఫ్(సీపీఎం నేతృత్వంలో కూటమి) సర్కారుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.;
ఔను!. గత కొంత కాలంగానే కాదు.. దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలానే ఉంది. చేజేతులా చేస్తున్న తప్పులు ఆపార్టీని మరింత బలహీన పరుస్తున్నాయి. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలి.. అనే విషయంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంది. కానీ, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. అనువుగాని చోట కూడా అధికులమే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అంతేకాదు.. అధికారాన్ని కూడా పోగొట్టేలా చేస్తోంది.
ఏం జరిగింది?
కేరళ సహా.. తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు చోట్లా కూడా.. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. నేరుగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా.. పొత్తు పెట్టుకుని అయినా.. అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు ప్రత్యర్థులకు వరంగా మారు తుంటే.. ఆ పార్టీ నాయకులకు శాపంగా పరిణమిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గెలుపు గుర్రం ఎక్కలేక తలకిందులు అవుతున్న పార్టీ ఇప్పుడు కూడా అదే ధోరణిని అనుసరించడంతో నాయకులు తల్లడిల్లుతున్నారు.
కేరళలో..
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్‌డీఎఫ్(సీపీఎం నేతృత్వంలో కూటమి) సర్కారుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దీనిని అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ, ఆ పార్టీ విస్మరిస్తోంది. పైగా కీలక నాయకులను కూడా పార్టీకి దూరం చేసుకుంటోంది. తిరువనంతపురం నుంచి నాలుగు సార్లు(20 ఏళ్లుగా) విజయం దక్కించుకుంటున్న శశిథరూర్ వంటి అగ్రనేతకు ఉద్వాసన చెప్పేందుకు రెడీ అయింది. ఆయన ప్రభావం దాదాపు 8 జిల్లాలపై ఉండడంతోపాటు.. రాజధాని తిరువనంతపురంలోనూ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, శశి వస్తానంటే.. పిలిచి కండువా కప్పేందుకు కమల నాథులు రెడీ అయ్యారు.
తమిళనాట..
తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ. వచ్చే ఎన్నికల్లో నూ కలిసి ముందుకు సాగుదామని.. బీజేపీకి అవకాశం ఇవ్వొద్దని.. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే చెబుతోంది. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ షరతులు పెడుతోంది. మరోసారి ప్రభుత్వం వస్తే.. హోం శాఖ, ఆర్థిక శాఖ సహా రహదారుల శాఖలను తమకు ఇవ్వాలని.. అధికారంలో సగం భాగస్వామ్యం కల్పించాలని.. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది.
దీంతో `పొత్తు విషయంలో మళ్లీ చూద్దాం..` అంటూ డీఎంకే నుంచి తిరస్కరణ ఎదురవుతోంది. పోనీ.. డీఎంకే కాదంటే.. ఇతర పార్టీలేవైనా కాంగ్రెస్‌ను చేరదీస్తాయా? అంటే.. కేవలం 5-7 శాతం మధ్య ఓటు బ్యాంకు పరిమితమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయినా.. మాదే పై`చేయి` అన్నట్టుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ చేజేతులా తప్పులపై తప్పులు చేస్తుండడం గమనార్హం.