ఆ నాయకుడితో సినీ మెగాస్టార్ ముచ్చట.. ఇదో రకం ప్రచారమే..

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. కోట్లాదిమంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నారు.

Update: 2024-05-10 11:52 GMT

ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనేక రకాల ఎత్తుగడలు వేస్తుంటాయి.. వ్యూహాలు పన్నుతుంటాయి. ప్రత్యర్థికి అందకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి.. ఇక సమాజంలో ప్రభావం చూపగల వ్యక్తులు, ప్రముఖుల మద్దతు కోసం అయితే సాధ్యమైనంత ప్రయత్నం చేస్తుంటాయి. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇలాంటిదే ఓ ఘటన జరిగిందని అనిపిస్తోంది. సరిగ్గా పోలింగ్ కు నాలుగు రోజులు కూడా లేని సమయంలో ఓ ఇద్దరి ముచ్చట అదో రకం ప్రచారమే అనే విశ్లేషణ రాజకీయ పరిశీలకుల నుంచి వస్తోంది.

భేటీ సమంజసమేనా?

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. కోట్లాదిమంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నారు. 15 ఏళ్ల కిందట రాజకీయంగానూ ఓ ప్రయత్నం చేసి తర్వాత విరమించుకున్నారు. ఇప్పుడు పూర్తిగా తన సినిమాలకే పరిమితం అయ్యారు. సినీ పరిశ్రమలో ఎవరికి అవసరం వచ్చినా ముందుంటూ సినీ పరిశ్రమ పెద్దను కాదు.. బిడ్డను అంటూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. కాగా, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జన సేన పార్టీని స్థాపించి ఏపీలో పదేళ్లుగా రాజకీయ పయనం సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని బీజేపీతో కలిపి కూటమి కట్టారు. ఏపీలో హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న రెండో తెలుగు నటుడు చిరంజీవి. ఇక పద్మ విభూషణ్ పురస్కారాన్ని గురువారం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు చిరంజీవి. ఇదే రోజు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి అయిన జి.కిషన్ రెడ్డితో అటు ఇంటర్వ్యూ ఇటు చిట్ చాట్ తరహాలో కాక ఓ సంభాషణ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇదీ ఓ ప్రచారమే అనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తం అవుతోంది.

Read more!

ఎన్నికల వేళ..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనుంది. సరిగ్గా దీనికి 48 గంటల ముందు చిరంజీవి-కిషన్ రెడ్డి భేటీ జరిగింది. కీలకమైన ఎన్నికల ప్రచార సమయాన్ని వదులుకుని మరీ కిషన్ రెడ్డి మెగాస్టార్ ను కలిశారు. సహజంగానే భారీగా అభిమానుల మద్దతు ఉన్నందున చిరంజీవితో భేటీ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అలా కిషన్ రెడ్డి పరోక్షంగా ప్రచారం చేసుకున్నట్లయింది.

కొసమెరుపు: ఏపీలో పిఠాపురం చి తమ్ముడు పవన్ కల్యాణ్ ను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపునిచ్చారు. ఇప్పుడు స్వయంగా సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఓటరు అయిన చిరంజీవి.. అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డితో మాటామంతీలో పాల్గొన్నారు.

Tags:    

Similar News