తుడా నిధులకు రెక్కలు..చెవిరెడ్డికి చిక్కులు

వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు జగన్ అండ చూసుకొని ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని ఆరోపణలున్నాయి.;

Update: 2025-06-05 10:10 GMT

వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు జగన్ అండ చూసుకొని ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జగన్ అండ చూసుకొని చెవిరెడ్డి వంటి నేతలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. తుడా చైర్మన్ గా పనిచేసిన సమయంలో చెవిరెడ్డి ఆ సంస్థ ఆదాయాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఆ లెక్కలు చెప్పాలని చెవిరెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్ కుటుంబానికి చెందిన వారు అధికారంల ఉంటే చాలు...తుడా చైర్మన్ పదవి చెవిరెడ్డిదే. వైఎస్ఆర్ కావచ్చు..వైఎస్ జగన్ కావచ్చు...ఆ పదవి మాత్రం చెవిరెడ్డిదే. ఎక్స్ ఆఫీషియో హోదాలో టీటీడీ బోర్డులోనూ చెవిరెడ్డి సభ్యుడిగా ఉండడంతో ఆయన కత్తికి రెండు వైపులా పదునే. దీంతో, తుడా నిధులను సొంత అవసరాలకు వాడుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన సొంత గ్రామంలో పనులకు, వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు తుడా నిధులనే చెవిరెడ్డి వాడారని ఆరోపణలొచ్చాయి. ఇక, మొత్తం నిధుల్లో 90 శాతం చంద్రగిరిలో వాడడం, అదీగాక తుడా నిధులతో పనులు చేయించి తాను వ్యక్తిగతంగా చేయించినట్లుగా పేర్లు వేయించుకోవడం కొసమెరుపు.

తన కంపెనీ పేరు మీద అన్ని పనులు చేయడం మరో విశేషం. ఆ డబ్బులన్నీ తన కంపెనీ ఖాతాలోనే జమ చేసుకొని ధీమాగా ఉండడం చెవిరెడ్డికే చెల్లింది. అయితే, కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెవిరెడ్డి అక్రమాలపై, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై సమాధానాలివ్వాలని నోటీసులచ్చింది.

Tags:    

Similar News