ఐదేళ్లలో పెరిగిన చంద్రబాబు ఆస్తుల విలువ తెలుసా?

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-04-20 05:05 GMT

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ లో చంద్రబాబుకున్న ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఇందులో భాగంగా.. రూ. 4,80,438 విలువైన చరాస్తులు, రూ. 36.31 కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు!

అవును... 2019లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల విలువ రూ.20.44 కోట్లుగా ప్రకటించగా.. ఈ క్రమంలో ప్రస్తుతం తన అఫిడవిట్‌ లో ప్రకటించిన ఆస్తుల విలువ 15.91 కోట్లు పెరిగినట్లు ప్రకటించారు. మరోవైపు, 2019లో భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 648.13 కోట్లుగా ప్రకటించగా.. 2024లో 895.47 కోట్లకు పెరిగినట్లు తెలిపారు! అంటే... 2019లో ఆమె ఆస్తి విలువతో పోలిస్తే... ఇప్పుడు ఆస్తులు రూ.247.34 కోట్లు పెరిగాయి.

మొత్తం మీద చంద్రబాబుకున్న రూ. 36.31 కోట్లు, భువనేశ్వరికున్న రూ. 895.47 కోట్లు కలిపి.. మొత్తంగా రూ. 931 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు! ఇదే సమయంలో చంద్రబాబు, తన కుమారుడు నారా లోకేష్‌ తో కలిసి జాయింట్ హౌసింగ్ లోన్ రూపంలో రూ.3.48 కోట్ల అప్పులు కలిగి ఉండగా, అతని భార్య భువనేశ్వరి మొత్తం అప్పులు రూ. 6.83 కోట్లుగా ఉన్నాయి.

ఇక చంద్రబాబుపై ఉన్న కేసుల విషయానికి వస్తే... వైసీపీ కార్యకర్తలపై ఆయుధాలతో దాడికి టీడీపీ కార్యకర్తలను ప్రేరేపించారనే ఆరోపణలపై అన్నమయ్య జిల్లాలోని ముదివీడు పోలీస్ స్టేషన్‌ లో (ఎఫ్‌.ఐ.ఆర్ నం.79 ఆఫ్ 2023) కేసు నమోదైంది. ఇదే సమయంలో... ఒక పోలీసు అధికారి ఆదేశాలను ధిక్కరించడం, బహిరంగ సభ నిర్వహించడం వంటి ఆరోపణలపై అనపర్తి పోలీసులు 2023 ఎఫ్‌.ఐ.ఆర్ నం.43లో కూడా బుక్ చేశారు.

Read more!

ఉచిత ఇసుకను అందించాలనే విధాన నిర్ణయాన్ని అమలు చేస్తున్నప్పుడు నిర్ణయ ప్రక్రియలో అవకతవకలకు సంబంధించి, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని 2023 నాటి ఎఫ్‌.ఐ.ఆర్ నం.19లో సీఐడీ పోలీసులు కేసు బుక్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు 2022 ఎఫ్‌.ఐ.ఆర్ నంబర్ 75లో మంత్రి రోడ్‌ షోలో ఆడపిల్ల చనిపోయారని ట్విట్టర్‌ లో చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ కు సంబంధించి ఓ కేసు నమోదు చేశారు.

ఇదే క్రమంలో.. గుంటూరు జిల్లాలోని అరండల్‌ పేట పోలీసులు 2021... రాష్ట్ర ప్రజలలో భయం, మానసిక ఒత్తిడి కలిగించేలా కోవిడ్ -19 రెండవ వేవ్ గురించి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదవ్వగా... దాదాపు ఇదే వ్యవహారంలో నరసరావుపేటలో కేసు నమోదైంది. ప్రివెంటివ్ అరెస్ట్ కేసులో పోలీసులు నమోదు చేశారు.

ఇదే సమయంలో మంగళగిరిలోని సీఐడీ పోలీసులు 2021 ఎఫ్‌.ఐ.ఆర్ నంబర్ 24లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కేసు నమోదు చేయగా.. ప్రజా సేవకులుగా తమ అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తమకు, వారి బంధువులు మరియు సహచరులకు తప్పుడు ప్రయోజనాలను అందించారనే ఆరోపణలపైనా కేసులు నమోదయ్యాయి!

Tags:    

Similar News