దేవినేని ఈ పదవితో సర్దుకుపోతారా?

అధికారంలోకి వచ్చాక వివిధ పదవుల ద్వారా ఇప్పుడు సీట్లు దక్కనివారికి న్యాయం చేస్తామని మూడు పార్టీల అధినేతలు చెబుతున్నారు.

Update: 2024-03-29 10:07 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీల్లోనూ కొంతమంది నేతలకు సీట్లు దక్కలేదు. దీంతో సీట్లు దక్కనివారు తమ పార్టీ అధిష్టానాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అధికారంలోకి వచ్చాక వివిధ పదవుల ద్వారా ఇప్పుడు సీట్లు దక్కనివారికి న్యాయం చేస్తామని మూడు పార్టీల అధినేతలు చెబుతున్నారు.

ముఖ్యంగా టీడీపీలో సీట్లు దక్కనివారి శాతం ఎక్కువ ఉంది. అందులోనూ కీలక నేతలకు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే కీలక శాఖలకు మంత్రులుగా పనిచేసినవారికే సీట్లు దక్కకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇలాంటి వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఒకరు.

కృష్ణా జిల్లా నందిగామ నుంచి రెండుసార్లు, మైలవరం నుంచి రెండుసార్లు దేవినేని ఉమా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఉమా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న దేవినేని ఉమాకు వచ్చే ఎన్నికల్లో సీటు లభించలేదు . వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరడంతో ఈ సీటును చంద్రబాబు ఆయనకు కేటాయించారు. దీంతో ఉమాకు సీటు లభించలేదు.

అయితే ఉమా మొదటి నుంచి టీడీపీలో ఉండటం, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి ఉండటంతో ఆయనకు చంద్రబాబు కీలక పదవిని అప్పగించారు. ప్రస్తుతం దేవినేని ఉమా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాజాగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.

Read more!

ఈ మేరకు దేవినేని ఉమాకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ అధిష్టానం ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల మధ్య ఉమా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

ఇప్పటికే పొత్తు వల్ల పలువురు టీడీపీ సీనియర్లకు సీట్లు దక్కలేదు. దీంతో వారంతా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. కొందరిని అధిష్టానం చల్లబర్చగా మరికొందరు రెబల్స్‌ గా బరిలోకి దిగుతామని వార్నింగులు ఇస్తున్నారు.

ఇలాంటి రెబల్స్‌ ను అందరినీ ఉమా సమన్వయకర్త హోదాలో శాంతింపజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సహకారం అందించేలా చూడాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త బాధ్యతల్లో ఉమా ఎంతవరకు విజయవంతమవుతారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News