లాలూచీ పాలిటిక్స్: తిరుపతి నేతలకు బాబు వార్నింగ్ ..!
తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు.;
తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. నాలుగు గోడల మధ్య జరిగిన ఈ సమావేశంలో కొంతమంది నాయకులకు ఆయన సీరియస్ గానే కొన్ని విషయాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యంగా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దూకుడు, లేకపోతే లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తున్న మూడు నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆయన సమీక్షించారు.
వారి వారి గ్రాఫ్ ను కూడా ఆయన వివరించారు. అంతేకాదు ప్రజల మధ్య ఉండని నాయకులను పక్కన పెడతానని కూడా హెచ్చరించారు. ప్రధానంగా సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన ఒక కీలక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి తరఫున సీనియర్ నాయకుడు విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పటికీ ఆయన సతీమణి ఆ నియోజకవర్గంలో చక్రం తిప్పడం పట్ల సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. ప్రధానంగా పార్టీ నాయకులను దూరం పెట్టి వ్యాపారాలు వ్యవహారాలు సాగిస్తున్నారని ఆమెపై వస్తున్న ప్రధాన విమర్శ.
అదే విధంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎవరికి వారుగా నాయకులు వ్యవహరిస్తున్న తీరుపట్ల చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఎవరు గెలిచారు అన్నది కాదు.. కూటమి తరపున అందరు కలిసి పనిచేయాలని ఆయన పదేపదే సూచిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకున్న ఆయన వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అంతేకాదు ఎక్కడా ప్రత్యర్థులతో లాలూచీ పడద్దని.. వారితో కలిసి వ్యాపారాలు వ్యవహారాలకు దూరంగా ఉండాలని కొంత కఠినంగానే చెప్పినట్టు తెలిసింది.
సత్యవేడు నియోజకవర్గంలో ఇన్చార్జిగా ఉన్న శంకర్రావు ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది పార్టీకి నష్టం కలిగించకుండా చూసుకోవాలని ఆయనకు సూచించారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలను ప్రధానంగా ప్రస్తావించిన చంద్రబాబు కుటుంబ సభ్యులను పక్కనపెట్టి ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల వస్తున్న ఫిర్యాదులు అదేవిధంగా పార్టీ రూపొందించిన నివేదికలను కూడా చంద్రబాబు వారి ముందు ఉంచి వారికి వివరించారు.
భవిష్యత్తులో తిరుపతి జిల్లాను మోడల్ జిల్లాగా మార్చాలని నిర్ణయించుకున్నామని ఈ క్రమంలో అందరూ కలిసికట్టుగా అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని కూడా తేల్చి చెప్పారు. తిరుపతి అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక వైసిపి పై విమర్శలు చేయడంలో వెనకబడుతున్న వారిని కూడా ఆయన మందలించారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో వచ్చిన ఆరోపణల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పై వచ్చిన విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టలేకపోయారని సీనియర్ నాయకులను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ఇట్లాంటివి వచ్చినప్పుడే కదా మీ సత్తా తెలుస్తుంది అని కూడా తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకోవాలని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఎవరిని ఉపేక్షించేది లేదని, లాలూచీ రాజకీయాలను అసలు సహించేది లేదని కూడా చంద్రబాబు స్పష్టం చేయడం గమనార్హం. మరి ఏ మేరకు తిరుపతి నాయకులు మారతారు అనేది చూడాలి.