బాబు చాణక్యం...జగన్ అసహనం!
ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ అంటే చంద్రబాబు పేరునే చెప్పుకోవాలి. ఆయన రాజకీయం ఎంతో పదును తేరి ఉంటుంది.;
ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ అంటే చంద్రబాబు పేరునే చెప్పుకోవాలి. ఆయన రాజకీయం ఎంతో పదును తేరి ఉంటుంది. అపర చాణక్యుడిగా బాబుకు పేరు. బాబులో ఆవేశం కంటే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికి ఏది అవసరమో దానికి తగినట్లుగా బాబు వ్యూహాలు ఉంటాయి. ఆయనకు ఉమ్మడి ఏపీ రాజకీయాలే కొట్టిన పిండి. ఎంతో మంది ఉద్ధండులతో ఢీ కొట్టిన బాబుకు విభజన ఏపీలో రాజకీయం బహు సులువు అన్నది విశ్లేషకులు చెబుతారు. ఇక ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీకి సర్వ సత్తాక నాయకుడు వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్. ఆయన పార్టీలో సీనియర్ల సలహాలు తీసుకుంటారో లేదో తెలియదు. కానీ వైసీపీ వ్యూహాలు మాత్రం అధిక శాతం పేలవంగా ఉంటూ ఎప్పటికప్పుడు బాబు చాణక్యం ముందు దూది పింజల మాదిరిగా తేలిపోతూనే ఉన్నాయి.
సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ :
వైసీపీ మీద ఒక విమర్శ ఉంది. సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో స్పెషలిట్ అని సెటైర్లు వేస్తారు. ఎన్నో సార్లు వైసీపీకి ఈ విధంగా ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ మళ్లీ అదే దూకుడు అదే తొందరపాటుతనంతో ముందుకు సాగుతూ షాకులు తింటోంది అని అంటున్నారు. అమరావతి రాజధాని ఎపిసోడ్ లో వైసీపీ వ్యూహాలు అన్నీ నేల బారుడుగానే ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు అమరావతి రాజధానిని 2014 నుంచి తలకెత్తుకున్నారు. నాటి నుంచి పన్నెండేళ్ళుగా టీడీపీది ఒకే మాట. ఒకే మాట. వైసీపీది మాత్రం గందరగోళం బాట. లేటెస్ట్ గా మావిగాన్ అంటూ మరో వింత ప్రకటనతో వైసీపీ రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఉచ్చులో చిక్కుకుని :
చంద్రబాబు సరైన సమయంలో సరైన వ్యూహాన్ని రచించారు. అదే అమరావతి రాజధానికి చట్టబద్ధత. నిజానికి 2024 జూన్ 12 నుంచి ఏపీలో బాబు సర్కార్ కొలువు తీరింది. బాబు తలచుకుంటే ఎపుడో చట్టబద్ధత వచ్చేసేది. కానీ ప్రతీ దానికి ఒక టైమింగ్ ముఖ్యం. రాజకీయాల్లో అయితే అది చాలా అవసరం. అందుకే అమ్ముల పొదిలో నుంచి అమరావతి రాజధాని అంశం ఇపుడు తీసారు. వైసీపీ ఈ మధ్యనే యాక్టివిటీని పెంచుకుంటోంది. జిల్లాల పర్యటనలకు జగన్ రెడీ అవుతారు అని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది పాదయాత్ర కూడా ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీకి ఉచ్చు బిగించి మరీ టీడీపీ తన ముగ్గులోకి లాగింది. వైసీపీ వ్యూహాల లేమితో ఆ ఉచ్చులో చి క్కుకుంది అని అంటున్నారు.
మౌనంగా ఉంటే చాలు :
వైసీపీకి అర్ధం కాని విషయం ఏమిటి అంటే రాజధాని వంటి సున్నితమైన అంశాలు ఏపీలోని అయిదు కోట్ల మంది జనాల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న విషయాల మీద మౌనంగా ఉండడం. అలా కాదు తాము అనుకున్నది చేస్తామంటే 2019 నుంచి 2024 మధ్య మూడు రాజధానులు అంటూ వైసీపీ చేసిన విన్యాసానికి జనాలు కఠినమైన తీర్పు ఇచ్చారు కదా. మరి దానిని గుర్తించి అయినా అమరావతి అంటే సైలెంట్ పాటించాలి కదా. ఇక జగన్ ఈ నెల 1న ప్రెస్ మీట్ పెట్టడం కూడా సరైన సమయం కాదని అంటున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టే వేళ జగన్ ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి చేసిన విమర్శలు పార్టీకి ఏ మాత్రం లాభం లేకపోగా తీవ్ర నష్టం కలిగించాయి. అంతే కాదు ఆయన లాస్ట్ పంచ్ అంటూ వదిలిన మావిగాన్ అన్నది ఏ మాత్రం అక్కరకు రాని ప్రతిపాదనగా మిగిలిపోవడమే కాడు ట్రోలింగ్ కంటెంట్ అయి రికార్డులు క్రియేట్ చేస్తోంది.
కోరుకున్నదే జరిగింది :
తమ ప్రత్యర్థి ఎపుడూ ఇబ్బందులో ఉండాలని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటుంది. టీడీపీ కూడా అదే కోరుకుంది. వైసీపీ కూడా అలాగే చేసింది. అమరావతికి వైసీపీ వ్యతిరేకం అని ఇన్నాళ్ళూ టీడీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల తరువాత అయినా వైసీపీ తీరు మారిందేమో అన్న డౌట్లు ఎక్కడో జనాల్లో ఉన్నాయి. అయితే మేము మారలేదు, మా దారి మావిగాన్ అంటూ వైసీపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది. దాంతో టీడీపీ పని మరింత సులువు అయింది. ఏపీ అభివృద్ధి కానీ సెంటిమెంట్ కానీ కోట్లాది మంది ప్రజలు పట్టించుకునే విషయాలుగా ఉన్నాయి. సాధారణంగా వాటిని గుర్తించి ముందుకు సాగాలి రాజకీయ పార్టీలు. కానీ వైసీపీ మాత్రం నేల విడిచి రాజకీయం చేస్తోంది. దాంతోనే ఆ పార్టీ గందరగోళంలో పడుతోంది అని అంటున్నారు.