బాబు డ్రీం ప్రాజెక్ట్...టార్గెట్ చేసిన అనుకూల మీడియా
తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ వినూత్నంగా ఆలోచిస్తూంటారు. ఆయన రొటీన్ కి భిన్నంగా కొన్ని విషయాల్లో వ్యవహరిస్తారు.;
తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ వినూత్నంగా ఆలోచిస్తూంటారు. ఆయన రొటీన్ కి భిన్నంగా కొన్ని విషయాల్లో వ్యవహరిస్తారు. ఆయన ప్లాన్స్ అన్నీ భారీ కాన్వాస్ తో పరచుకుని ఉంటాయి. అలా తన ప్లాన్స్ ని అన్నింటినీ సంపూర్ణంగా చేయాలన్న సంకల్పం సైతం ఆయనకు ఉంటుంది. అయితే బాబు ఎంచుకున్న మార్గం సుగమం కాదు అది ఒకింత దుర్లభం దుర్గమం. అయినా ఆయన చాలెంజ్ గా తీసుకుంటారు. కాదు జరగదు అన్నది ఆయన థియరీలో లేదు, అందరి చేతా అవును అనిపిస్తారు.
చంద్రబాబు అనేక విషయాల్లో సక్సెస్ అయ్యారు. కొన్ని విషయాల్లో విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏపీకి నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు మదిలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో అమరావతి రాజధాని ఒకటి. అయితే దానితో పాటుగా ఆయన మానసపుత్రికగా మరో ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ బాబుకు నిజంగా ఎంతో ఇష్టమైనది సంతృప్తిని ఇచ్చేది అని చెప్పుకుంటారు. అలాంటి బాబు డ్రీం ప్రాజెక్ట్ మీద అనుకూల మీడియావే గట్టిగా టార్గెట్ చేస్తూ హాట్ హాట్ గా కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమా ప్రాజెక్ట్, ఏమా కధ అంటే మ్యాటర్ చాలానే ఉంది మరి.
పీ 4 మీద విమర్శలు :
చంద్రబాబు పీ 4 ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏపీలో పేదరికం అన్నది లేకుండా చేయాలన్నదే ఆయన ఆలోచన. ఏపీలో అత్యంత పేదరికం తో సతమతమవుతున్న వారు ఇరవై శాతం గా ఉన్నారు. వారిని బాగా ధనవంతులుగా ఉన్న పది శాతం మందికి ఎటాచ్ చేసి వారికి అండగా నిలిచేలా చేసేదే ఈ పీ 4 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఒక వేదికగా ఉంటుంది. అంటే ధనవంతులను పేదలను కలిపి అంతరం తగ్గించడం. పేదరికం పూర్తిగా లేకుండా చేయడం. ఇది చెప్పడానికి మంచి ప్రాజెక్ట్ కానీ ఆచరణలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద ఏపీలో ప్రముఖ మీడియా సంస్థ విశ్లేషిస్తూ బాబు నీద ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అయ్యే పనేనా అంటూ :
ఈ భూమి మీద ఎపుడూ అంతరం ఉంది అన్నది ఒక సిద్ధాంతం. పేదలు లేని సమాజం లేదు అన్నది మరో ఫీలాసఫీ. ఈ రెండూ నిజమే. అందుకే పేదరికం ఎక్కడకి వెళ్ళినా కనిపిస్తుంది. అభివృద్ధి ఎంతో చెందామని చెప్పుకునే దేశాలలో సైతం పేదరికం రెక్కలు విప్పుకుని చాలా చోట్ల దర్శనం ఇస్తుంది. ఎవరైనా చేసే పని పేదరికాన్ని వీలైనంత వరకూ తగ్గించే ప్రయత్నం చేయడమే కానీ పేదరికం అన్నది లేకుండా చేయడం ఎవరి వల్లా కానే కాదు అన్నది అంతా చెబుతున్న మాట. దానినే పట్టుకుని సదరు టీడీపీ అనుకూల మీడియా బాబు తీరుని తప్పుపడుతోంది. బాబు ఎందుకు ఈ తరహా ప్రాజెక్టుని ఎంచుకున్నారో అర్ధం కావడం లేదు అంటూ కామెంట్స్ చేసింది.
వారి వల్లనే ఇదంతా అంటూ :
బాబు ఎపుడు సీఎం అయినా ఆయన పక్కన కొంతమంది చేరుతారు అని వారు ఇచ్చే సలహా సూచనల వల్లనే ఈ తరహా ఆలోచనలు వస్తూంటాయని కూడా సదరు మీడియా దుయ్యబెట్టింది. బాబు సైతం తన శ్రమను ఆలోచనలను సమయాన్ని అంతా ఈ తరహా వాటి మీద ఎక్కువగా పెడుతూ విలువైన కాలాన్ని అలా ఉపయోగిస్తున్నారు అని చెణుకులు వేసింది. 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేస్తామని బాబు చెబుతున్న మాటలను కూడా సదరు మీడియా తమ విశ్లేషణలలో గట్టిగా తప్పుపట్టింది. బాబు అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ ఈ కొత్త రకం ఆలోచనల వెంట పడడం వృధా ప్రయాస పడడం మామూలు అయిపోయింది అని కూడా విమర్శిస్తోంది.
అచరణ సాధ్యం కానిది :
పీ 4 పధకం ఆచరణ సాధ్యం కాదని కూడా సదరు మీడియా కుండబద్ధలు కొడుతోంది. అంతే కాదు అది ఏ విధంగానూ ఉపయోగం లేనిది అని అంటోంది. కనీస ఆలోచనలు చేయకుండా బలవంతంగా మార్గదర్శులకు బాధ్యతలు ఇస్తున్నారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన తంటా ఏమిటి అంటే ఆయన ఏది పట్టుకుంటే దాని వెంట పడతారు. అలవిమాలిన ఆలోచనలను ఆయన ఇష్టపడుతూంటారు అని విమర్శించింది. పేదలను ధనవంతులు దత్తత తీసుకోవాలని ఈ ప్రాజెక్ట్ ద్వారా కోరుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు అని కూడా నిప్పులు చెరిగింది. మొత్తానికి బాబు నేల విడిచి సాము చేస్తున్నారు అని తేల్చేసింది. మరి బాబుకు ఎంతో ప్రీతిపాత్రమైన పీ 4 ప్రాజెక్ట్ మీద ఒక అనుకూల మీడియావే ఈ విధంగా ధాటీగా విమర్శించడం మీద టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది.