జగన్ పరామర్శించరా...బాబు మాత్రం !
| ఏపీలో వారం వ్యవధిలో వచ్చిన రెండు తుఫాన్లతో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. మరోవైపు జగన్ తుఫాన్ బాధితులను పరామర్శించకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ ఆరోపణలకు పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత సమాధానం చెబుతానని చంద్రబాబు ప్రకటించారు.
ఏపీలో రెండు భారీ తుఫాన్లు కేవలం వారం వ్యవధిలోనే వచ్చి వెళ్ళాయి.అందులో ఒక తుఫాన్ ఆర్నాబ్ వల్ల అయిదు వేల కోట్ల నష్టం వాటిల్లింది. మురసు తుఫాన్ వల్ల రెండు వేల కోట్లు నష్టం వచ్చింది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా మొత్తం ఉమ్మడి తొమ్మిది జిల్లాలూ తుఫాన్ తాకిడికి అతలాకుతలం అయ్యాయి. ఏపీకి తుఫాన్లు ఈ సీజన్ లో రావడం సహజం. అక్టోబర్ నవంబర్ నెలలను తుఫాన్ల నెలలుగానే చెబుతారు. అయితే ఇంత దగ్గరగా రెండు తుఫాన్లు వచ్చి ఏపీని తీవ్ర నష్టాల కష్టాల పాలు చేయడం మాత్రం గతంలో ఎపుడూ జరగలేదు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వారం పది రోజులుగా తుఫాన్ల మీద రివ్యూ చేయడమే కాదు ఎయిర్ సర్వేలు చేస్తున్నారు. అలాగే పొలాల్లోకి వెళ్ళి దెబ్బ తిన్న పంటను పరిశీలిస్తున్నారు, అదే విధంగా రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇస్తున్నారు.
విపక్ష నేత ఎక్కడ :
అదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ అని విమర్శలు వస్తున్నాయి. భారీ తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రాంతాలు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శించాలి కదా అని అంటున్నారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రోజుకీ అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. కరెంట్ లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్ష నేతగా జగన్ రావాలి కదా అని ప్రత్యర్థుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు సైతం జగన్ మీద గట్టిగానే విమర్శలు చేశారు.
ప్రజలు కష్టాల్లో ఉంటే :
ఏపీలో తుఫాన్ల వల్ల ప్రజలు కష్టాలలో ఉంటే జగన్ రాజకీయాల గురించి మాట్లాడడం మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్థానిక ఎన్నికలలో అక్రమాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని మీదనే బాబు మాట్లాడారు. తాను ఇపుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాను అని అన్నారు. ప్రజల బాధలను తెలుసుకుంటూ వాటి గురించే ఆలోచిస్తున్నాను అన్నారు. అందుకే జగన్ చేసిన విమర్శల మీద తాను స్పందించలేదని అన్నారు. ఈ విధంగా బాబు మాట్లాడడం ద్వారా జగన్ కి ప్రజల కష్టాల కంటే రాజకీయాలే ఎక్కువ అన్నట్లుగా పరోక్ష విమర్శలు చేసినట్లు అయింది అని అంటున్నారు. నిజంగా ఈ వ్యాఖ్యలు విన్న వారు కూడా జనం ఇబ్బందుల్లో ఉంటే రాజకీయాల గురించా అని అనుకోవడం కూడా సహజమే అంటున్నారు.
అన్నింటికీ జవాబు :
జగన్ ఏ విమర్శలు చేసినా ఇపుడు కాదు, వాటికి పరిషత్తు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మొత్తంగా ఒకేసారి జవాబు చెబుతాను అని చంద్రబాబు చెప్పారు. ఏవి నిజాలు ఏవి అవాస్తవాలు అన్నది కూడా తాను అన్నీ పూర్తిగా చెబుతాను అని బాబు ప్రకటించారు. దాంతో బాబు ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి చెబుతారు అన్నది ఇపుడు ఉత్కంఠగా మారింది. జగన్ అయితే బాబు మీద పెద్ద ఎత్తునే విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్నికలకు కావు ఎంపికలు అన్నారు. వ్యవస్థలు అన్నీ హైజాక్ చేశారని కబ్జా చేశారని రిగ్గింగ్ చేశారు అని కూడా జగన్ పదునైన కామెంట్స్ నే చేశారు. దీంతో బాబు ధీటైన బదులు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. బహుశా ఆదివారం చంద్రబాబు మీడియా మీట్ ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు. సో బాబు జగన్ మీద ఏ రేంజిలో కామెంట్స్ చేస్తారో చూడాల్సిందే.