పవన్ తో స్నేహం చరిత్రనే మార్చింది! చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్!
టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అంతా ఒక అద్భుతంగా సీఎం వ్యాఖ్యానించారు. విజన్ పాలిటిక్స్ కు టీడీపీ నాంది పలికిందని, ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడిందని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు జనసేనతో పొత్తును ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చరిత్రలో ఎన్నో పొత్తులు పెట్టుకున్నామని, కానీ 2024 ఎన్నికల ముందు జనసేనాని పవన్ ముందుకు వచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు ప్రకటించారని, ఆ తర్వాత బీజేపీని కూటమిలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మంగళిగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ జాతీయ, రాష్ట్ర ప్రతినిధులతో పార్టీ కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న కేడర్ తో వర్చువల్ గా సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం 1875 క్లసర్ల నుంచి కేడర్ మహానాడును వర్చువల్ గా వీక్షిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభోపాన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ పండగలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటూ తొలిరోజే అదరగొట్టారని అభినందించారు.
టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అంతా ఒక అద్భుతంగా సీఎం వ్యాఖ్యానించారు. విజన్ పాలిటిక్స్ కు టీడీపీ నాంది పలికిందని, ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడిందని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను టీడీపీయే పరిచయం చేసిందని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇక మహానాడు సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో పలు పంచ్ డైలాగులు పేల్చారు. విపక్షం వైసీపీని ఉద్దేశిస్తూ వేటకొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానమని విమర్శించారు. ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం టీడీపీ విధానమంటూ గొప్పగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య డైలాగును పేల్చారు. గొడ్డలి పార్టీ నెవ్వర్ అగైన్ అంటూ మహానాడు వేదికగా చంద్రబాబు నినదించారు. పేదలకు కావాల్సింది గొడ్డలి పోట్లు కాదు.. యువతకి కావాల్సింది ఉద్యోగాలు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శాంతిభద్రతలు కావాలని, రక్తాభిషేకాలను ఎవరూ కోరుకోరని విపక్షంపై విమర్శలు గుప్పించారు. రక్తచరిత్రను రాసేవారు స్వర్ణాంధ్రను లిఖించలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.