వీరయ్య చౌదరి పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి!

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-23 18:01 GMT

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మనబ్రోలుకు వెళ్ళిన చంద్రబాబు వీరయ్య చౌదరి భౌతికకాయానికి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఓదార్చిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను వదిలిపెట్టబోమని ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ఇది రాక్షస చర్య అని, నేర రాజకీయాలను సహించేది లేదని చంద్రబాబు అన్నారు. తాను ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని చంద్రబాబు తెలిపారు. ఆ వెంటనే ఎస్పీతో మాట్లాడానని, హత్య జరిగిన తీరు దారుణంగా ఉందని చెప్పారు.

కరడుగట్టిన నేరస్థులు కూడా ఇలా చేయరని, వీరయ్య చౌదరి శరీరంపై 53 కత్తి పోట్లున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తోందని అన్నారు. లోకేష్ యువగళం కార్యక్రమంలో వీరయ్య చౌదరి 100 రోజులు పాల్గొన్నారని, అమరావతి రైతుల పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. వీరయ్య చౌదరి పార్టీ కోసం కష్టపడ్డారని, నాగలుప్పలపాడు మండలంలో 10 వేల ఓట్ల మెజార్టీ తెచ్చే స్థాయికి ఎదిగాడని కొనియాడారు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఘటన జరిగినప్పుడు ఆఫీస్‌లో ఉన్న మరో వ్యక్తిని బెదిరించారని, ముసుగులు ధరించి వచ్చిన దుండగులు ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించి వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని ఆదుకుంటామని, వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ పెద్దగా తాను అండగా ఉంటానని, ఇలాంటి దుర్మార్గులను తుదముట్టించే వరకు పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News