యూరియా వద్దనుకుంటే బస్తాకు రూ.800.. చంద్రబాబు కీలక నిర్ణయం
ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రొత్సహకాలిచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.;
కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలిరోజు సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, యూరియా, ఆక్వా రైతులు, ఇళ్ల పట్టా లబ్దిదారులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో ఐదో బ్లాకులో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో పలు రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రధానంగా వ్యవసాయంపై చర్చ సందర్భంగా యూరియా సరఫరాపై పెద్ద చర్చ జరిగింది. రాష్ట్రంలో యూరియా కొరత లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత పక్కా ప్రణాళికతో వెళ్లాలని సీఎం అధికారులకు, కలెక్టర్లకు సూచించారు. ఈ క్రమంలో యూరియా వినియోగం తగ్గించేలా రైతులను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
యూరియాతో క్యాన్సర్ ముప్పు
యూరియా వినియోగం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనే అంశం సదస్సులో చర్చకు వచ్చింది. యూరియా వినియోగం పెరిగితే క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా వినియోగం ఎక్కువైతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందోననడానికి పంజాబ్ రాష్ట్రం ఓ కేస్ స్టడీగా సీఎం ఉదహరించారు. ప్రస్తుతం రాష్ట్రం క్యాన్సర్ కేసుల్లో టాప్-5లో ఉందని, యూరియా వినియోగం మరింతగా పెరిగితే టాప్-1కు వెళ్లిపోతుందని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో యూరియా వాడకం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు.
ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రొత్సహకాలిచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. యూరియా వినియోగం తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద బస్తాకు రూ. 800 ప్రొత్సాహకంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని, రైతులకు ఇవ్వడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కంటే రైతులకు ఇవ్వడం ముఖ్యమమన్నారు. రాష్ట్రానికి వచ్చే సబ్సిడీని రైతులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
బలభద్రపురంపై అధ్యయనం చేయండి
ఇదే సందర్భంలో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్న అంశాన్ని మంత్రి నాదెండ్ల ప్రస్తావించారు. ఆ గ్రామంలో ఎరువులు, యూరియా వినియోగం కూడా ఎక్కువగా ఉందనే రీతిలో అధికారులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల నమోదు కావడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా..? అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని, ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. డిమాండ్, సప్లైకి అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్య పరచటంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఉద్యాన ఉత్పత్తులు, ఎగుమతుల విషయంలో క్లస్టర్ అప్రోచ్ ఉండాలని చెప్పారు. కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువ ఉందని గుర్తు చేశారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితి మారుతుందని వివరించారు. ఆయిల్ పామ్ తోటల సాగు ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్ గా మారిందని చెప్పారు. ఇక ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా వస్తున్న సమస్యలతో కొన్ని పంటలపై ప్రభావం పడుతోందని అన్నారు. హెచ్డీ బర్లీ పొగాకు 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేశామని చెప్పారు. మామిడికి కిలో రూ.4 చొప్పున రూ.200 కోట్ల వరకూ రైతులకు చెల్లించామన్నారు. ఉల్లి పంట కొనుగోలు విషయంలో ప్రతిపక్షం డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాను రూ.1200తో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏం చేస్తే రైతులకు లాభం వస్తుందో అధ్యయనం చేసి ఆయా మార్గాలు రైతులు అనుసరించేలా చైతన్యపర్చాలని సీఎం చెప్పారు. రైతులకు నష్టం రాకుండా రవాణా ఛార్జీలు భరించి ప్రాసెసింగ్ కు పంపించేందుకు అవకాశం ఉందని.. ఈ తరహాలోనే కలెక్టర్లు ఆలోచనలు చేయాలని చంద్రబాబు సూచించారు.