చంద్రబాబుపై తమ్ముళ్ల గుస్సా వెనక స్టోరీ ఇదే..!
అయితే, గత కొన్నాళ్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు ఎమ్మెల్యేలు అటు మంత్రులు కూడా కొంత అసహనంతో ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి.;
ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే పార్టీలో క్రమశిక్షణకు మారుపేరు. అయితే, గత కొన్నాళ్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు ఎమ్మెల్యేలు అటు మంత్రులు కూడా కొంత అసహనంతో ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ప్రస్తుతం కూడా బిజెపితో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, గతానికి భిన్నంగా ఇప్పుడు బిజెపిని పదే పదే పొగుడుతుండడం, ప్రధాని మోడీని పదేపదే ఆకాశానికి ఎత్తేస్తుండడం వంటివి నాయకులకు ఇబ్బందిగా మారింది.
అంతే కాదు క్షేత్రస్థాయిలో కూడా ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించాలంటూ నాయకులకు సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుండడంతో తాము అలా చేసే పరిస్థితిలో లేమని కొందరు నాయకులు తగేసి చెబుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇస్తున్నప్పటికీ అంత భారీ స్థాయిలో పొగడాల్సిన అవసరం ఏముంటుందని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అతిగా ప్రశంసించడం వల్ల మన పార్టీని మనం బలహీనపరచుకునే పరిస్థితిలోకి దిగజారిపోయే అవకాశం ఉంటుందన్నది కొందరు చెబుతున్న మాట.
కానీ, పార్టీలో మాత్రం ప్రధాని మోడీని, అదేవిధంగా బిజెపిని కూడా ప్రశంసించాలంటూ పెద్ద ఎత్తున సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా `డబుల్ ఇంజన్ సర్కార్` అని చెప్పాలని సీఎం చంద్రబాబు సూచించినట్టు సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. 2014 -19 మధ్య కూడా బీజేపీతో కలిసి ఉన్నామని, కానీ అప్పట్లో ఇంతగా ప్రచారం చేయలేదని కానీ ఇప్పుడు ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తుందో తమకు అర్థం కావడం లేదని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి టిడిపికి ఉన్న బలం ముందు బిజెపికి పెద్దగా బలమేమీ లేదని అంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు అనవసరంగా ఇట్లాంటి విషయాలను భుజాలపై వేసుకొని టిడిపి మైలేజీని ఎందుకు తగ్గించుకోవాలన్నది వారు సంధిస్తున్న ప్రధాన ప్రశ్న. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో కేంద్రంతో కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు. ఈ క్రమంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్ని కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యత అవసరం ఉన్నాయని ఆయన అంటున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు మాత్రం అంతగా ప్రశంసలు గుప్పించాల్సిన అవసరం లేదని, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొనియాడ వచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బిజెపి నాయకులను ముఖ్యంగా కేంద్రంలోని ప్రధాని మోడీని ప్రశంసించడం పొగడడం అనే అంశాలపై జోరుగానే చర్చ సాగుతూ ఉండడం గమనార్హం. ఈ విషయంలో బాబు చెప్పినట్టు వినేందుకు నాయకులు రెడీగా లేక పోవడం గమనార్హం.