వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. కొత్త రచ్చకు తెరతీసిన కేంద్రం?
జాతీయ జెండాను ఎగురవేసే అన్ని సందర్భాల్లోనూ.. సాంస్క్రతి కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించటం ఇక తప్పనిసరవుతుంది.;
జాతీయ గీతం.. జాతీయ గేయం. చూసేందుకు ఒక్కటిగా ఉన్నప్పటికీ.. రెండింటికి మధ్య వ్యత్యాసం చాలానే. వందేమాతరం జాతీయ గేయం అయితే.. జనగణమన జాతీయ గీతం. వందేమాతరాన్ని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. పాడేందుకు అస్సలు ఇష్టపడరు. తాము జాతీయ గీతమైన జనగణమన పాడతామని.. వందేమాతరం ఆలపించేందుకు ససేమిరా అనేటోళ్లు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా వందేమాతరం మీద కేంద్రప్రభుత్వం కొత్త ప్రోటోకాల్ తీసుకొచ్చింది.
తాజా నిబంధనల ప్రకారం ఇకనుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరాన్ని అలపించాలి. సర్లే.. కానిచ్చేద్దామని కొందరు అనుకోవచ్చు. అసలు చిక్కేమంటే.. వందేమాతరం ఇప్పుడు మనం రెగ్యులర్ గా వినే వెర్షన్ కాకుండా.. ఒరిజినల్ వెర్షన్ ను ఆలపించాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలు.. వేడుకల్లో తొలుత 3 నిమిషాల 10 సెకన్ల పాటు వందేమాతరంలోని ఆరు చరణాల్ని ఆలపించాలన్న సూచన తాజాగా చేశారు.
దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త ప్రోటోకాల్ ను ప్రకటించింది. ఈ ప్రోటోకాల్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. తాజా నిబంధన ప్రకారం వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. పౌర పురస్కారాలు.. రాష్ట్రపతి.. గవర్నర్లు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో వందేమాతరం ఆలపించాలి. సినిమాహాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. జాతీయ గీతం.. జాతీయ గేయం ఆలపించేటపపుడు అంతరాయం కలిగిస్తే బాధ్యులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది.
స్కూళ్ల కార్యక్రమాలు తప్పకుండా వందేమాతరంతో మొదలు కావాలి. ఇందుకోసం స్కూళ్ల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమాలు.. వేడుకల్లో వందేమాతరం ఆలాపన చేయాలంటే అందుకు అనుగుణంగా తగిన ఆడియో సిస్టమ్ ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. వందేమాతరం ఆరు చరణాలను ఆలపించేందుకు వీలుగా కరపత్రాలను కూడా కార్యక్రమానికి హాజరైన వారికి పంపిణీ చేయొచ్చు.
జాతీయ జెండాను ఎగురవేసే అన్ని సందర్భాల్లోనూ.. సాంస్క్రతి కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించటం ఇక తప్పనిసరవుతుంది. మంత్రులు పాల్గొనే అనధికారిక కార్యక్రమాల్లో కూడా సామూహికంగా ఈ గీతాన్ని ఆలపించొచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశాల్లో విద్యార్థులంతా సామూహికంగా ఈ ఆరు చరణాల పూర్తి గీతాన్ని పాడాలని స్పష్టం చేశారు.
దేశభక్తి.. మాతృభూమిపై ప్రేమతో మర్యాదపూర్వకంగా సముచితమైన పద్దతిలో ఏ ప్రోగ్రాంలో అయినా వందేమాతరం ఆలపించొచ్చని తెలిపింది. ఇదంతా వందేమాతర గేయం 150 వసంతాల వేడుకనుకేంద్రం నిర్వహిస్తున్న వేళ.. ఈ మార్గదర్శకాల్ని విడుదల చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు మొదటి రెండు చరణాల్ని మాత్రమే ఆలపించేవారు. అందుకు భిన్నంగా ఆరు చరణాల్ని ఆలపించేందుకు పట్టే సమయం 3.10నిమిషాలు. దీంతో ప్రాక్టికల్ సమస్యలు ఎదురవుతాయన్న వాదనను కొందరు వినిపిస్తున్నారు.
వందేమాతరం గీతాన్ని పశ్చిమబెంగాల్ కు చెందిన బంకిం చంద్ర ఛటర్జీ రాశారు. 1838 జూన్ 27న పుట్టిన ఆయన.. సంస్క్రతం - బెంగాలీ మిశ్రమ భాషలో ఈ గీతాన్ని రాశారు. ఇంతకూ వందేమాతరం గీతాన్ని సింఫుల్ గా ఒక్క లైన్ లో అర్థాన్ని చెప్పాలంటే.. అమ్మా.. నీకు నేను నమస్కరిస్తున్నానని. ఈ పాట సాహిత్యం భారతమాతకు నివాళి. భారతమాత అందం.. వైభవాన్ని కీర్తించేలా ఈ గీతం ఉంటుంది.దీన్ని 1870లలో రాశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం యావత్ భారతాన్ని ఏకం చేసింది.
వందేమాతరం మొత్తం ఆరు చరణాల్లో ఉంటుంది. అయితే.. ఇప్పటివరకు దీన్ని మొదటి రెండు చరణాల్లోనే ఆలపించేవారు. ఇందుకు పట్టే సమయం 66 సెకన్లు. తాజాగా కేంద్ర హోం శాఖ జారీ చేసిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం చూస్తే.. వందేమాతరం ఆరు చరణాలను ఆలపించేందుకు 3.10 నిమిషాల సమయం పడుతుంది. ఇక.. జనగణమన ఆలపించేందుకు పట్టే సమయం 52సెకన్లు. తాజాగా తీసుకొచ్చిన ప్రోటోకాల్ పై కొందరు అభ్యంతరం చెప్పే వీలుందన్నది వాదన. దీనికి కారణం.. ముస్లింలు కొందరు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా వందేమాతరం ఉండదన్న వాదనను వినిపిస్తూ ఉంటారు.వందేమాతరం గీతం ఇస్లామిక్ ఏకేశ్వరోపాసనకు విరుద్ధంగా ఉంటుందన్న మాటను కొందరు చెబుతుంటారు. వందేమాతరంలోని కొన్ని చరణాలు విగ్రహారాధనకు సంబంధించినవిగా ఉండటం.. అది ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధంగా ఉందన్న వాదనను వినిపిస్తూ ఉంటారు.