కేంద్రం నిర్లక్ష్యం.. కూటమి పై కన్నెర్ర ..!
కేంద్రం చేస్తున్న నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వానికి శాపంగా మారుతోంది.;
కేంద్రం చేస్తున్న నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వానికి శాపంగా మారుతోంది. రెండు కీలక విషయాల్లో కేంద్రం అనుసరిస్తున్న వ్యవహారం.. కూటమిని ఇరుకున పెడుతోంది.
1) తల్లికి వందనం.
2) బనకచర్ల ప్రాజెక్టు.
ఈ రెండు విషయాల్లోనూ కేంద్రం నుంచి సహకారం కనిపించడం లేదని తెలుస్తోంది. తల్లికి వందనం అనేది ... సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఆ తల్లులకు దీనిని అమలు చేస్తున్నారు.
తాజాగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థు ల తల్లుల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు వేస్తున్నారు. అయితే.. గత వైసీపీ హయాంలో కేంద్ర ప్రభు త్వ అధీనంలోని పాఠశాలలకు కూడా.. ఈ పథకాన్ని వర్తింప చేశారు. కేంద్రం పరిధిలో ఉండే.. జవహర్ నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల్లో చదివే పేద పిల్లలకు.. కూడా వైసీపీ హయాంలో నిధులు వెళ్లాయి. అయితే.. తాజాగా కేంద్రీయ సంస్థల్లో చదివే వారి వివరాలు రాష్ట్రానికి అందుబాటులో లేకుండా పోయాయి.
దీంతో ఆయా స్కూళ్లలో చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన వారికి తల్లికి వందనం చేరలేదు. దీంతో వారంతా విషయం తెలియక.. సర్కారు పై నిప్పులు చెరుగుతున్నారు.తమకు తల్లికి వందనం అందలేదని.. వాపోతున్నారు. ఈ పరిస్థితికి కేంద్రమే కారణం.. కేంద్రం సరైన జాబితా ఇచ్చి ఉంటే వారికి కూడా నిధులు పడేవి. ఇప్పుడు ఈ వ్యవహారంపైనే రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టి లేఖలు రాసింది. అయినా.. కేం ద్రం నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అర్హులు మాత్రం సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇక, రెండో విషయం.. బనకచర్ల. దీనికి కూడా.. కేంద్రం నుంచి సరైన సహకారం దక్కడం లేదనే వాదన వినిపిస్తోంది. కర్నూలు జిల్లా బనకచర్లలో చేపట్టే ప్రాజెక్టుతో వృథాగా పోతున్న గోదావరి నీటిని ఒడిసి పట్టి.. సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, దీనిపై కేంద్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. తెలంగాణ రాజకీయ ప్రయోజనాలను కూడా లెక్కించుకుంటున్న కేంద్రం.. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో రైతులు, రైతు సంఘాలు కూడా.. ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కూటమిలో భాగస్వామ్య పక్షాన్ని ఒప్పించేలా చేయలేక పోతున్నారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.