క్రమంగా విస్తరిస్తున్న యుద్ధ నష్టాలు.. సిమెంట్ ధరలు పైపైకి..

యుద్ధం ప్రభావంతో సిమెంట్ ధరలు పెరగనున్నాయనే సమాచారం భవన నిర్మాణదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.;

Update: 2026-03-31 22:30 GMT

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దేశంలో క్రమంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు గ్యాస్, ఆయిల్ కష్టాలను మాత్రమే తెచ్చిపెట్టిందని భావిస్తున్నప్పటికీ, క్రమంగా ఆ నష్టం విస్తరిస్తూ దాదాపు అన్ని రంగాల్లో ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రధానంగా యుద్ధం వల్ల దేశ పారిశ్రామిక రంగం తీవ్ర నష్టాలు, కష్టాలను ఎదుర్కోవాల్సివస్తోందని చెబుతున్నారు. ఇక తాజాగా యుద్దం వల్ల దేశంలో సిమెంట్ పరిశ్రమకు గడ్డు కాలం మొదలైందని సమాచారం. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు బస్తాకు రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

యుద్ధం ప్రభావంతో సిమెంట్ ధరలు పెరగనున్నాయనే సమాచారం భవన నిర్మాణదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో నిర్మాణ పనులు మందగించి కూలీలకు ఉపాధి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. సిమెంట్ ధరలు పెరుగుతాయనే ప్రచారంతో డీలర్లు, వ్యాపారులు అప్రమత్తమయ్యారని చెబుతున్నారు. వారం రోజుల్లో పెంపు ఉంటుందన్న సమాచారం లీకవడంతో హోల్ సేల్ డీలర్లు రిటైల్ వ్యాపారులకు సిమెంట్ సరఫరా తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర కంపెనీని బట్టి రూ.280 నుంచి రూ.320 వరకు ఉంది. ధరల పెంపుతో ఈ వారం ఇది రూ.320 నుంచి రూ.370కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ ధర ఉంటే తప్ప తమకు గిట్టుబాటు కాదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ప్రధాన సిమెంట్ కంపెనీ బోర్డు సభ్యుడు చెప్పినట్లు కథనాలు ప్రచారమవుతున్నాయి. యుద్ధం కారణంగా ఖర్చులు పెరిగిపోవడమే ధరల పెంపు నిర్ణయానికి రావాల్సివచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి.

సిమెంట్ పరిశ్రమ ఖర్చుల్లో 30 శాతం విద్యుత్, ఇంధనాలకే ఖర్చు అవుతుందని అంటున్నారు. దేశంలో ప్రధాన సిమెంట్ కంపెనీలు అన్నీ తమ ఇంధన అవసరాల్లో 50 శాతం నుంచి 60 శాతం దిగుమతి చేసుకునే పెట్రోలియం కోక్ ద్వారా తీర్చుకుంటాయి. దిగుమతి చేసుకునే ఈ పెట్ కోక్ ధర యుద్ధానికి ముందు టన్ను 125 నుంచి 130 డాలర్లు అంటే సుమారుగా రూ.12,285 ఉంటే ఇప్పడు అది రూ.160 నుంచి 165 డాలర్లకు పెరిగిందని అంటున్నారు. అంతే ఇండియన్ కరెన్సీ ప్రకారం పెట్ కోక్ ధర రూ.15,120 నుంచి రూ.15,592 మధ్య లభిస్తోందని చెబుతున్నారు.

ఈ ధరలకు అదనంగా మార్చి 20వ తేదీ నుంచి లీటర్ ఇండస్ట్రియల్ డీజిల్ధరను కేంద్రం రూ.23.75కి పెంచేసింది. ఇక సిమెంట్ ప్యాకింగ్ కోసం ఉపయోగించి పాలీప్రొప్లైన్ (పీపీ) వోవెన్ ఫ్యాబ్రిక్ ధరలైతే 85 శాతం పెరిగిపోయాయి. ఈ పెరిగిన ఖర్చుల భారం తట్టుకోవాలంటే ధరలు పెంచడం తప్ప తమకు మరో మార్గం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఐదు కంపెనీల ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయిల్ కంపెనీలు ధరలు పెంచితే రవాణా ఖర్చులు మరింత తడిసి మోపెడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News