శబరీ...తొందరలోనే పదవీ !
తెలుగుదేశం పార్టీలో చురుకైన ఎంపీగా ఉన్నారు భైరెడ్డి శబరి. ఆమె 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున నంద్యాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.;
తెలుగుదేశం పార్టీలో చురుకైన ఎంపీగా ఉన్నారు భైరెడ్డి శబరి. ఆమె 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున నంద్యాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. కేవలం ఏడాది కాలంలోనే తన పనితీరుతో ఆమె టీడీపీ హైకమాండ్ ని ఆకట్టుకున్నారు. ఆమె పార్లమెంట్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృత్తి రిత్యా ఆమె వైద్యురాలిగా ఉన్నారు. ఉన్నత విద్యావంతురాలిగా ఆమె ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు.
ఇక ఆమె కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినది. ఆమె తండ్రి భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉద్యమ నాయకుడు. శబరి కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇలా ఆమె అన్ని విధాలుగా రాయలసీమలో వైసీపీని బలమున్న చోట గెలిచి మరీ తన సత్తా చాటుకున్నారు.
దాంతో ఆమె విషయంలో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. తొందరలోనే జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం సాగుతోంది. నిజానికి ఆగస్టులో కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. ఏపీ నుంచి మరో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.
అయితే జనసేనకు ఆ పదవి ఇస్తారని ప్రచారం ఒక వైపు సాగుతోంది. ఎందుకంటే ఇద్దరు ఎంపీలు ఉన్న జనసేనకు కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కలేదు ఒక్క ఎంపీ ఉన్న పార్టీలకు కూడా మంత్రి పదవి దక్కింది. అయితే ఇపుడు ఆ ముచ్చట తీర్చాలని కేంద్రం ఉందని అంటున్నారు.
అయితే ఇది కూడా పవన్ ఇష్టాఇష్టాల మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇక పవన్ చంద్రబాబు ఆలోచించుకుని ఎవరి పేరు చెబితే వారికే మంత్రి పదవి అని అంటున్నారు. అయితే నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో జనసేన నుంచి ఉన్న ఇద్దరు ఎంపీలలో ఒకరు మచిలీపట్నానికి చెందిన వారు, మరొకరు కాకినాడకు చెందిన వారు. ఇప్పటికే ఉత్తరాంధ్రా, గోదావరి కోస్తా ప్రాంతాల నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఉందని అంటున్నారు.
దాంతో ఈసారి రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు బలమైన సామాజిక వర్గానికి ఈ పదవి ఇస్తే సమతూకంతో పాటు సామాజిక సమీకరణలు కూడా పాటించినట్లుగా ఉంటుందని లెక్క వేస్తున్నారు అని అంటున్నారు. దాంతో రాయలసీమకు చెందిన మహిళా ఎంపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శబరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.
ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి మహిళలు ఎవరూ లేరని గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా ఏపీ నుంచి మహిళకు మంత్రివర్గంలో లేరని అంటున్నారు. యూపీఏ హయాంలో దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణి కీలక మంత్రి పదవులు నిర్వహించారని అంటున్నారు.
ఎన్డీయే కూడా ఈ లోటుని భర్తీ చేసుకోవడంతో పాటు రాయలసీమలో కూటమికి సామాజికంగా రాజకీయంగా ఉపయోగపడేలా శబరికి కేంద్రంలో చోటు కల్పిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.