బీజేపీ నిర్ణయంతో తకరారు.. పొత్తు ఉన్నట్టా.. లేనట్టా?

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయమే ఉంది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందనే అంచనాలు ఉన్నాయి.

Update: 2024-02-23 06:23 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయమే ఉంది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. మరోవైపు జనసేన, బీజేపీ మధ్య ఇప్పటికే పొత్తు ఉంది. ఈ క్రమంలో మూడు పార్టీలు కలసి పోటీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీతో కలిసి పోటీ చేయడానికి బీజేపీని ఒప్పించడానికి తాను బీజేపీ జాతీయ నాయకుల చేత చీవాట్లు తిన్నానని.. నా స్థాయిని దిగజార్చుకుని వారితో మాట పడాల్సి వచ్చిందని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భీమవరంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఇంతవరకు బీజేపీతో పొత్తుపై జనసేన, టీడీపీ నేతలు మాట్లాడటమే తప్పించి బీజేపీ జాతీయ నాయకత్వం దీనిపై నోరు మెదపడం లేదు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. తామైతే అన్ని అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంటు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామని పేర్కొంటున్నారు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 27న ఏలూరులో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ రాజనా£Š సింగ్‌ హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అగ్ర నాయకులు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులతో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి బీజేపీ గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read more!

మరోవైపు ఫిబ్రవరి 28న టీడీపీ, జనసేన కలిసి మొదటిసారిగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరవుతారు. ఈ సభలోనే వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించొచ్చని చెబుతున్నారు. ఆరు లక్షల మందితో ఈ సభ నిర్వహించడానికి రెండు పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇంకోవైపు ఎన్డీయేలోకి రమ్మని బీజేపీ తమను ఆహ్వానించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. బీజేపీతో పొత్తు ఫైనలయ్యాక సీట్లు ఖరారవుతాయని తెలిపారు. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనేది పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారన్నారు. బీజేపీ చెప్పే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాక ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందన్నారు.

టీడీపీ, జనసేన.. బీజేపీ తమతో చేరుతుందని చెబుతుండగా బీజేపీలో మాత్రం ఇంతవరకు ఉలుకుపలుకు లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి పొత్తుల విషయం మాట్లాడి వస్తారని అన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఢిల్లీ వెళ్లడానికి పవన్‌ సిద్ధమయ్యారు. అయితే కేంద్ర నాయకుల అపాయింటుమెంట్లు ఖరారు కాకపోవడంతో పవన్‌ పర్యటన రద్దయిందని అంటున్నారు.

పవన్‌ ఢిల్లీ వెళ్లి పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం మాట్లాడక కానీ పొత్తులపై స్పష్టత రాదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తాము అన్ని సీట్లలో పోటీ చేస్తామని.. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని చెబుతుండటం కొసమెరుపు. బీజేపీతో పొత్తు తేలే వరకు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? మేనిఫెస్టో విడుదల వంటి వాటి విషయంలో మరికొంత ఆలస్యం తప్పేలా లేదంటున్నారు.

Tags:    

Similar News