బిల్ గేట్స్ తో అందుకే విడాకులు తీసుకున్నా : మెలిందా సంచలనం

విడాకుల ప్రక్రియ తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సమయంలో తాను ఎంతో భయాందోళనకు గురయ్యానని మెలిందా తెలిపారు.;

Update: 2025-04-16 00:30 GMT

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ తన జీవితంలో విడాకులు తీసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని స్వయంగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు. పరిస్థితులు అలా ఉండబట్టే తాము విడిపోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మెలిందా సూటిగా సమాధానమిచ్చారు. "మీ బంధాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విలువలను మీరు నిలబెట్టుకోలేకపోతే, విడాకులు తీసుకోవడం తప్పనిసరి" అని ఆమె కుండబద్దలు కొట్టారు. అయితే, బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలపై మరింత స్పందించేందుకు ఆమె నిరాకరించారు.

విడాకుల ప్రక్రియ తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సమయంలో తాను ఎంతో భయాందోళనకు గురయ్యానని మెలిందా తెలిపారు. కానీ, ఆ తర్వాత తన జీవితం ఆనందంగా కొనసాగుతోందని ఆమె వెల్లడించారు. ఇటీవల బిల్ గేట్స్ విడుదల చేసిన 'సోర్స్ కోడ్' పుస్తకం గురించి ప్రస్తావించగా, ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మెలిందాతో విడాకులు తనను చాలా బాధించాయని చెప్పడం గమనార్హం.

దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మరియు మెలిందా 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ఇరవై ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేవలం మైక్రోసాఫ్ట్ అధినేతలుగానే కాకుండా, అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈ జంట ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు. అయితే, వారి విడాకులకు దారితీసిన అసలు కారణాలను మాత్రం వారు బహిరంగంగా వెల్లడించలేదు.

అయితే, ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలో ఒక కథనంలో సంచలన విషయం పేర్కొంది. లైంగిక నేరాల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధం మెలిందాను తీవ్రంగా కలచివేసిందని, అందుకే ఆమె విడాకులు తీసుకున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఏది ఏమైనప్పటికీ, మెలిందా తాజా వ్యాఖ్యలు వారి విడాకులకు గల అంతర్గత కారణాలపై కొంత స్పష్టతనిచ్చాయి. బంధంలో విలువలు ముఖ్యమని, వాటిని కాపాడుకోలేకపోతే విడిపోవడమే సరైన నిర్ణయమని ఆమె చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇద్దరూ తమతమ జీవితాల్లో ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News