పెయిడ్ పాత్రికేయులతో తలనొప్పులు.. టీడీపీ, వైసీపీలకు ఒకే రకమైన టార్చర్

నిన్న వైసీపీ.. ఈ రోజు టీడీపీ.. తమ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో చిక్కుల్లో పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది.;

Update: 2025-07-01 11:30 GMT

నిన్న వైసీపీ.. ఈ రోజు టీడీపీ.. తమ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో చిక్కుల్లో పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. యూట్యూబ్, డిజిటల్ మీడియా ప్రభావం బాగా పెరగడంతో ఇటీవల కాలంలో ఇండిపెండెంట్ జర్నలిజం ఎక్కువైంది. దీంతో చాలా మంది జర్నలిస్టులు సొంతంగా చానళ్లు ప్రారంభిస్తున్నారు. కొందరు కొన్ని చానళ్లలో జరిగే డిబెట్లకు వెళుతూ తమ వాణి వినిపిస్తున్నారు. అయితే కొందరు జర్నలిస్టులు ఇలా డిబేట్లు, తమ చానళ్లలో విశ్లేషణలలో ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటమే విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో ఆయా పార్టీల గ్రాఫ్ ను దెబ్బతీస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెయిడ్ పాత్రికేయం పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో శ్రుతిమించిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూట్యూబ్ ప్రభావంతో చాలా కాలం క్రితమే కొందరు జర్నలిస్టులు పెయిడ్ గెస్టులుగా మారిపోయారని అంటున్నారు. పార్టీల నుంచి డబ్బు తీసుకుని ఆ పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ప్రజలపై వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందో కానీ, ఆయా పార్టీలు మాత్రం ఎక్కువగా దెబ్బతింటున్నాయని అంటున్నారు.

గత ఎన్నికల వరకు వైసీపీకి ప్రజల్లో మంచి గ్రాఫ్ ఉందని ఈ పెయిడ్ జర్నలిస్టులు చేసిన ప్రచారంతో ఆ పార్టీ ఎక్కువగా నష్టపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా చాలా మంది హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూర్చొని ఇదే ప్రజాభిప్రాయం అంటూ తమ సొంత వ్యాఖ్యానాలు చేయడం పార్టీల నాయకత్వాలు కూడా అదే నిజమని నమ్మి దెబ్బతింటున్నాయని అంటున్నారు.

ఇది ఒక్క వైసీపీకే కాదని తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి పెయిట్ జర్నలిస్టులను ఎక్కువగా నమ్ముకుందని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయంటున్నారు. అటు తెలంగాణలోనూ అన్నిపార్టీలు కూడా కొందరు జర్నలిస్టులను ఎంగేజ్ చేసుకుని తమకు అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. అయితే పార్టీల నుంచి డబ్బు అందుకుంటున్న కొందరు జర్నలిస్టులు టీవీ చానళ్ల డిబేట్ సందర్భంగాను, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతరులను కించపరిచేలా, టార్గెట్ చేసిన వారి ఆత్మస్థైర్యం దెబ్బకొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు.

రిటైర్ అయిన జర్నలిస్టులు, ఉద్యోగాలు లేని పాత్రికేయులు ఎక్కువగా ఎనలిస్టు అవతారం ఎత్తడం, వారిని సమన్వయం చేయడంలో పార్టీలు పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఎనలిస్టులుగా మారిన జర్నలిస్టులు వల్ల మేలు జారుతుందని ఆశిస్తే, కీడే ఎక్కువగా జరుగుతుందని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News