ఆర్సీబీ తొక్కిసలాట ఎఫెక్ట్.. బెంగళూరులో రెండో అతిపెద్ద స్టేడియం
చిన్నస్వామి స్టేడియం.. భారత క్రికెట్ తో ఎంతో ముడిపడి ఉన్న ఈ స్టేడియం తొక్కిసలాట కారణంగా చెడ్డపేరు మూటగట్టుకుంది.;
ఈ ఏడాది తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సొంత నగరంలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో సన్మాన సభ ఏర్పాటు చేయగా అది కాస్త దారితప్పి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. వాస్తవానికి బెంగళూరు ప్రస్తుతం తీవ్ర ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలోనూ మీమ్స్, రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఉద్యాన నగరిగా, ఐటీ క్యాపిటల్ గా పేరున్న బెంగళూరు ఇప్పుడు మోస్తరు వర్షానికే ట్రాఫిక్ చిక్కులు, భారీ వర్షాలకు మునిగిపోతూ చెడ్డ పేరు తెచ్చకుంటుంది. ఇక ఆర్సీబీ కప్ గెలిచిన మరుసటి రోజే (కొన్ని గంటల్లోనే) బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ చేపట్టాలని తొలుత భావించినా.. ట్రాఫిక్ తట్టుకోలేమని పోలీసులు అభ్యంతరం చెప్పారు. ర్యాలీ తప్పినా.. విషాదం మాత్రం చోటుచేసుకోకుండా ఆపలేకపోయారు.
చిన్నస్వామికి మరో స్వామి తోడు
చిన్నస్వామి స్టేడియం.. భారత క్రికెట్ తో ఎంతో ముడిపడి ఉన్న ఈ స్టేడియం తొక్కిసలాట కారణంగా చెడ్డపేరు మూటగట్టుకుంది. అంతేకాక.. బెంగళూరు సిటీలో ఉండడంతో మ్యాచ్ ల సమయంలో ట్రాఫిక్ రీత్యా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో మరో స్టేడియం నిర్మాణానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రూ.1,650 కోట్లతో.. 100 ఎకరాల్లో
రూ.1,650 కోట్లతో ఈ భారీ స్టేడియాన్ని బొమ్మసంద్రలోని సూర్య సిటీలో నిర్మించనున్నారు. దీని సీటింగ్ సామర్థ్యం 80 వేలు. ఈ స్టేడియం పూర్తయితే దేశంలో రెండో అతిపెద్దదిగా నిలవనుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం 1.30 లక్షలు. కాగా, సూర్య సిటీలో వంద ఎకరాల్లో కొత్త స్టేడియం కట్టనున్నారు. ఇది చిన్నస్వామి స్టేడియం కంటే ఎంతో విశాలమైనది కానుంది. చిన్నస్వామి స్టేడియం 17 ఎకరాల్లోనే ఉంది. సీటింగ్ కెపాసిటీ కూడా 32 వేలు మాత్రమే. ఇప్పుడు కొత్త మైదానం ఐదింతల విశాలమైన స్థలంలో, దాదాపు మూడు రెట్లు అధిక సీటింగ్ సామర్థ్యంతో నిర్మాణం కానుంది.