బేగంపేట ఎయిర్ పోర్టులో ఆరు ప్రైవేటు చార్టర్లు రెఢీ.. ట్రై చేస్తారా?

కొన్ని విమాన సంస్థలు తక్కువ ధరలకే టికెట్లు అమ్మేందుకు అనుమతులు తీసుకొని.. అందుకు భిన్నంగా భారీగా వసూలు చేస్తున్న దందా పెరుగుతోంది.;

Update: 2026-02-11 06:30 GMT

ఖరీదైన పెళ్లిళ్లు.. ఇస్పెషల్ పార్టీలు.. సినీ ఫంక్షన్లు.. ఇలా హైప్రొఫైల్ తో పాటు.. సంపన్నులు ఇటీవల కాలంలో ప్రైవేటు జెట్ లు వినియోగిస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ ట్రెండ్ హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తోంది. మనదైన ప్రైవేటు జెట్ లో కోరుకున్న టైంకు.. కోరుకున్నట్లుగా ప్రయాణించే వీలు ఉండటంతో.. వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తగ్గట్లే బేగంపేట ఎయిర్ పోర్టులో ఏకంగా ఆరు ప్రైవేటు జెట్ లు తమ కస్టమర్లకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. గడిచిన రెండేళ్లలో వీటి సర్వీసులు ఎక్కువ కావటం గమనార్హం.

డెస్టినేషన్ వెడ్డింగ్ ల ట్రెండ్ పెరగటం.. హైదరాబాద్ నుంచి రాజస్థాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు బెంగళూరు.. వైజాగ్ లాంటి నగరాల్లో జరిగే ఖరీదైన వెడ్డింగ్ లు.. సినిమా కార్యక్రమాలకు ఈ ప్రైవేటు జెట్ లను వినియోగిస్తున్నారు. మామూలు విమాన ప్రయాణం విషయానికే వస్తే.. వ్యక్తిగత గోప్యత విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవటం.. చెకిన్ లాంటివి తలనొప్పిగా మారుతోంది. దీంతో.. కొన్ని వర్గాల వారు మామూలు విమానాల కంటే తమ కోసం తమదైన ప్రైవేటు ఫ్లైట్ లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.

కొన్ని విమాన సంస్థలు తక్కువ ధరలకే టికెట్లు అమ్మేందుకు అనుమతులు తీసుకొని.. అందుకు భిన్నంగా భారీగా వసూలు చేస్తున్న దందా పెరుగుతోంది. దీంతో.. ఇలాంటి వాటి కారణంగా భారీగా టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు.. ఆ తిప్పల్ని వదిలేసి.. తమ వరకు వేరుగా ప్రైవేటు జెట్ లను బుక్ చేసుకుంటున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఇప్పుడు 50, 100, 200 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రైవేటు జెట్ లు అందుబాటులో ఉన్నాయి. సంపన్న కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లకు సంబంధించి.. కొన్ని స్పెషల్ పార్టీలకు తాము ఆహ్వానించిన అతిధులను ఈ ప్రైవేటు జెట్ లలో తీసుకెళ్లటం ఇప్పుడో ట్రెండ్ గా మారింది.

మరి.. ఖర్చు సంగతేంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. 50 సీట్ల విమానాన్ని అద్దెకు తీసుకుంటే రూ.60 లక్షలు.. అదే వంద సీట్లు ఉన్న విమానాన్ని అద్దెకు తీసుకుంటే రూ.90 లక్షలు.. అదే 200 సీట్ల సామర్థ్యం ఉన్న విమనాన్ని అద్దెకు తీసుకుంటే రూ.1.25 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. సింఫుల్ గా చెప్పాలంటే.. 50, 100 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రైవేట్ జెట్ లు ఒక్కో సీటు మీద చేస్తున్న ఛార్జ్ దగ్గర దగ్గర రూ.90వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. అదే 200 సీట్లు ఉన్న ప్రైవేటు జెట్ అయితే రూ.60 వేల వరకు పడుతుంది.

సంపన్నులు.. కొన్ని సినిమా ఫంక్షన్లు.. ముఖ్యమైన రాజకీయ సభలకు ప్రత్యేకంగా వెళ్లేందుకు ఈ ప్రైవేటు జెట్ లను వినియోగిస్తున్నారు. సాధారణ ఎయిర్ పోర్టులో చెకిన్.. చెక్ అవుట్ సమయం భారీగా తగ్గటంతో పాటు.. ఫ్లైట్ జర్నీలో తమ అతిధులకు స్పెషల్ సేవల్ని అందించేందుకు ప్రైవేటు జెట్ లు అనువుగా ఉండటంతో కొందరు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఖరీదైన వేడుకల్ని మరింత ఖరీదుతో చేసేందుకు ప్రైవేటు జెట్ లు తమ వంతు సాయాన్ని అందిస్తున్నట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News