రైతును పెళ్లి చేసుకుంటే రూ. 10 లక్షలు? ప్రభుత్వానికి చేరిన వినూత్న ప్రతిపాదన

అన్నం పెట్టే అన్నదాతకు పిల్లనిచ్చే నాథుడే కరువయ్యాడు. ఎకరాల భూమి, పక్కా ఇల్లు ఉన్నా.. 'రైతు' అనే ముద్ర పడటమే పెళ్లికి అడ్డంకిగా మారుతోంది.;

Update: 2026-02-20 14:30 GMT

అన్నం పెట్టే అన్నదాతకు పిల్లనిచ్చే నాథుడే కరువయ్యాడు. ఎకరాల భూమి, పక్కా ఇల్లు ఉన్నా.. 'రైతు' అనే ముద్ర పడటమే పెళ్లికి అడ్డంకిగా మారుతోంది. కర్ణాటకలో వేలాది మంది యువ రైతులు బ్రహ్మచారులుగా మిగిలిపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రానురాను సామాజిక సంక్షోభంగా మారుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే రంగనాథ్ రైతుల పెళ్లి సమస్యపై అసెంబ్లీలో మాట్లాడారు. యువ రైతులను పెళ్లి చేసుకునే యువతులకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వాలని సూచించారు. దీంతో కన్నడ నాట ఈ అంశం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి సంక్షోభమే ఏర్పడుతోందని అంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం వస్తుందేమోనని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

కర్ణాటకలో యువ రైతులకు పెళ్లి కావడం లేదన్న అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలోని మండ్య, కోలార్, తుమకూరు వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు దాటిన వేలాది మంది యువ రైతులు పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా గడపాల్సివస్తోందని అంటున్నారు. 2024లో మండ్య జిల్లాకు చెందిన సుమారు 200 మందికి పైగా బ్రహ్మచారి యువ రైతులు "వధువు కావాలి" అని కోరుకుంటూ చామరాజనగర్ జిల్లాలోని ఎంఎం హిల్స్ వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం సమస్య తీవ్రతకు నిదర్శనంగా చెబుతున్నారు.

యువ రైతుల పెళ్లి సమస్య ఒక సామాజిక సంక్షోభంగా మారుతోందని అంటున్నారు. దీనిపై కచ్చితమైన గణాంకాలు లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం వేల సంఖ్యలో యువ రైతులు పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. కోట్ల ఆస్తి ఉన్నా సరే వ్యవసాయం చేస్తున్నారన్న కారణంగా యువకులకు పెళ్లికావడం లేదని చెబుతున్నారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం స్థిరంగా ఉండదనే భయం, నగర జీవనంపై వ్యామోహం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండటానికి యువతులు ఇష్టపడకపోవడం వంటి కారణాలతో యువతులు రైతులను పెళ్లి చేసుకోడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. కూలీ పనైనా సరే నగరంలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నరని చెబుతున్నారు. సొంతంగా ఎకరాల భూమి ఉన్న రైతును చేసుకోవడానికి వధువుతోపాటు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాల్సివస్తోంది. తాజాగా అసెంబ్లీలో చర్చ సందర్భంగా రైతును పెళ్లి చేసుకునే యువతి పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్లు వినిపించాయి. నిజానికి ఈ అంశం గత ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువ రైతులను పెళ్లి చేసుకునే యువతులకు రూ.రెండు లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని జేడీఎస్ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవకపోవడంతో ఈ హామీకి ప్రాధాన్యం లేకపోయింది.

కానీ, ఎన్నికల సమయం నుంచి యువ రైతుల పెళ్లి సమస్య చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన బ్రహ్మచారి యువ రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏపీలో కూడా కొంతవరకు ఉందని విశ్లేషిస్తున్నారు. కర్ణాటకకు సమీపంలో ఉండే అనంతపురం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అసెంబ్లీలో ఒకసారి ప్రస్తావించారు. కాకపోతే కర్ణాటకలో ఉన్నంత తీవ్రంగా ఏపీలో ఈ సమస్య ముదరలేదని అంటున్నారు. గతంలో వివాహాల కోసం వధువు తల్లిదండ్రులు కట్నం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో ఎదురు కట్నాలు ఇచ్చుకునేందుకు వరుడు సిద్ధమవుతున్నా వధువు దొరకని పరిస్థితి ఉందని అంటున్నారు. మొత్తానికి అసెంబ్లీలో చర్చ తరువాత ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News