మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ముహూర్తం ఫిక్స్

ఇదిలా ఉంటే అనకాపల్లి లో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ విషయంలో పూర్తి స్థాయిలో చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్‌ను ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్టల్ దావోస్ వేదిక నుంచే ప్రశంసించారు.;

Update: 2026-01-21 18:20 GMT

ఏపీలో మరో కీలక ప్రాజెక్ట్ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనకు రంగం సిద్ధం అయింది. ఫిబ్రవరి 15 తర్వాత శ్రీకారం చుట్టేందుకు అంతా రెడీ అవుతోంది. ఈ మేరకు అంతా ఫిక్స్ చేసినట్లే అని అంటున్నారు. ఈ మేరకు దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మిట్టల్ తో స్టీల్ ప్లాంట్‌ శంకుస్థాపన విషయం మీద చర్చించారు. దాంతో ముహూర్తం అన్నది అపుడే ఫిక్స్ చేశారు.

భారీ ప్రాజెక్ట్ గా :

అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశను ఏకంగా అరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. ఇక శంకుస్థాపనకు ముందే స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన భూమి కేటాయింపుతో సహా అన్ని అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని అక్కడ నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించడం విశేషం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరాన్ని ఆయన అధికారులకు స్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఈ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు పొందాలని మంత్రులు నారా లోకేష్, టిజి భరత్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

లోకేష్ కి ప్రశంసలు :

ఇదిలా ఉంటే అనకాపల్లి లో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ విషయంలో పూర్తి స్థాయిలో చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్‌ను ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్టల్ దావోస్ వేదిక నుంచే ప్రశంసించారు. రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి ముఖ్యమంత్రి ఆదిత్య మిట్టల్‌కు వివరించడం ఈ సందర్భంగా విశేషం. ఏపీ సన్ రైజ్ స్టేట్ అని కూడా బాబు చెప్పారు.

బాబు ఫుల్ బిజీ :

ఇక దావోస్ లో మూడవ రోజు కూడా చంద్రబాబు పూర్తి బిజీగా గడిపారు. యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జెయూదితో ఆంధ్రప్రదేశ్‌లో దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపైన బాబు చర్చించారు. అగ్రిటెక్, ఫుడ్ టెక్, ఆక్వా టెక్, ఫుడ్ పార్కుల అభివృద్ధి ఆహార భద్రత పైన సైతం ఆయన చర్చించారు. ఇక ఏపీలో విమాన కనెక్టివిటీ, ఓడరేవులు, రోడ్లు రైల్వే నెట్‌వర్క్‌లతో సహా వాణిజ్యం ఎగుమతులకు ఉన్న అవకాశాల గురించి ముఖ్యమంత్రి యూఏఈ మంత్రికి వివరించి పెట్టుబడులను ఆహ్వానించారు. డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్, ఏడీ పోర్ట్స్, అడ్నాక్ కంపెనీల నుండి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ తీసుకోవాలని బాబు యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జెయూదిని కోరారు. ఉద్యానవన, ఆక్వా మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

యూఏఈ సానుకూలత :

ఇక ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన పురోగతి గురించి ముఖ్యమంత్రి యూఏఈ మంత్రికి సమగ్రంగా వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తారమైన అవకాశాలను ఆయన చెప్పుకొచ్చారు ఏపీలో అంతరిక్ష డ్రోన్ నగరాల అభివృద్ధికి సహకారం కూడా యూఏఈ నుంచి కావాలని బాబు కోరారు ఇక చంద్రబాబు చేసిన అనేక ప్రతిపాదనలపైన యూఏఈ మంత్రి సానుకూలంగా స్పందించారు. ఏపీ విషయంలో ఆ విధంగా యూఏఈ తన పాజిటివ్ నెస్ ని ప్రకటించినట్లు అయింది. దాంతో బాబు దావోస్ టూర్ లో ఇదొక కీలకమైన మేలు మలుపుగా భావిస్తున్నారు.

Tags:    

Similar News