ఏపీలో కొత్త సర్వే...పథకాలతో పాటు ప్రయోజనాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త సర్వేను చేస్తోంది. డిసెంబర్ 18 నుంచే కొన్ని ప్రాంతాలలో ఈ సర్వే ఇప్పటికే స్టార్ట్ అయింది.;

Update: 2025-12-22 05:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త సర్వేను చేస్తోంది. డిసెంబర్ 18 నుంచే కొన్ని ప్రాంతాలలో ఈ సర్వే ఇప్పటికే స్టార్ట్ అయింది. మరి కొన్ని చోట్ల త్వరలో మొదలెట్టబోతున్నారు. కుటుంబాలకు చెందిన వివరాలను మొత్తం ఈ సర్వే రూపంలో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాలు అయినా కార్యక్రమాలు అయినా ప్రజలకు చేరువ చేయడానికి కానీ మరింత సైంటిఫిక్ బాటలో వాటిని అందించడానికి కానీ ఈ సర్వే ఉపయోగపడుతుందని గట్టిగా నమ్ముతోంది.

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే :

ఈ సర్వేకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేగా పేరు పెట్టారు. తెలుగులో అంటే అన్ని అంశాలతో ఏకీకృతమైన సర్వేగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సర్వే ద్వారా ప్రతీ కుటుంబం వద్దకు వెళ్ళి పూర్తి సమాచారం వారి నుంచి సేకరిస్తున్నారు. ఈ సర్వే కోసం గ్రామ సచివాలయ సిబ్బందికి పూర్తిగా వినియోగించుకుంటున్నారు. సర్వే ఏకంగా నెల రోజుల పాటు సాగనుంది. ఈ సర్వే ద్వారా వచ్చిన డేటా తో భవిష్యత్తులో ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయాలన్న సరి చూసుకుంటుంది అన్న మాట.

సిబ్బందికి శిక్షణ :

ఈ సర్వే కోసం సచివాలయ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వారు ప్రజల వద్దకు వెళ్ళేమి ఏమేమి అడగాలి, ఏ విధంగా సమాచారం రాబట్టాలి అన్నది కూడా శిక్షణలో తెలియజేశారు. ఈ సర్వేలో ఒక ప్రశ్నావళి ఉంటుంది. దాని ఆధారంగా ప్రశ్నలను ఆయా కుటుంబీకులను అడిగి ఆ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇక ఈ సర్వేలో కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి ప్రధానంగా నమోదు చేస్తారు. వారికి ఉద్యోగం ఉంటే దానికి కూడా వివరంగా తీసుకుంటారు. ఆయా ఇంట్లో చదువుకున్న వారు ఉన్నారా అన్నది కూడా అడుగుతారు. ఆ ఇంట్లో ఉన్న గృహోపయోగ పరికరాలు, అలాగే వాహనాలు ఉంటే వాటి వివరాలు కూడా సేకరిస్తారు.

వీటి వివరాలు కూడా :

ఆ కుటుంబంలో కుల ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఇక ఆ కుటుంబానికి సంబంధించిన మ్యాపింగ్ చేస్తారు అలా చేయడంతో ఆ సర్వే పూర్తి అయినట్లుగా వేలు ముద్ర కానీ సంతకం కానీ ఆ కుటుంబం పెద్ద నుంచి తీసుకుంటారు.

పకడ్బంధీగా చేయడానికే :

ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు అవుతున్నాయి. వాటిని మరింత పకడ్బంధీగా అమలు చేయడానికే ఈ సర్వే అని చెబుతున్నారు. ఈ సర్వే లో వచ్చిన డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. రేపటి రోజున పధకాలు అమలు చేసేటపుడు ఈ వివరాలే ప్రమాణంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఏకీకృత సర్వే గ్రామాల్లో జరుగుతోంది. రానున్న రోజుల్లో పట్టణాలలో కూడా చేపడతారు. మొత్తంగా డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. దాంతో అర్హత ప్రమాణంగా ఎవరికి పధకాలు దక్కాలో చూసి మరీ కచ్చితంగా అమలు చేస్తారని అంటున్నారు. ప్రతీ ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనాలని కోరుతున్నారు.

Tags:    

Similar News