క్రెడిట్-క్రెడిబిలిటీ-కేపబిలిటీ.. వాటీజ్ రియాల్టీ?!
ఏపీలో క్రెడిబిలిటీ(విశ్వసనీయత) రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నుంచి ప్రారంభమైన ఈ వాదన.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందనతో మరింత చర్చనీయాంశం అయింది.;
ఏపీలో క్రెడిబిలిటీ(విశ్వసనీయత) రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నుంచి ప్రారంభమైన ఈ వాదన.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందనతో మరింత చర్చనీయాంశం అయింది. క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ.. వైసీపీ నాయకులు గత ఆరు మాసాలుగా టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గూగుల్ డేటా కేంద్రం వరకు.. అదేవిధంగా సూపర్ సిక్స్ హామీల దాకా.. క్రెడిట్ తమదేనని చెబుతున్నారు.
కానీ, చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారన్నది వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అదేసమయంలో క్రెడిబిలిటీపైనా వైసీపీ నాయకులు చర్చిస్తున్నారు. విశ్వసనీతయ కేవలం జగన్‌కే ఉందన్నది వారు చెబుతున్నారు. అయితే.. తాజాగా చంద్రబాబు దీనికి ఘాటుగా స్పందించారు. క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. కియా, సైబరాబాద్, అమరావతి నిర్మాణం వంటివి తమ పాలనకు, విజన్‌కు తార్కాణంగా నిలుస్తాయని చెప్పారు.
ఇక, వైసీపీ కి మాత్రమ వైన్స్, శాండ్, మైనింగ్ వంటివి అక్రమాలే క్రెడిట్ అని వ్యాఖ్యానించారు. సరే.. అసలు.. ఈ క్రెడిట్-క్రెడిబిలిటీ-కేపబిలిటీ వ్యవహారంలో ఎవరు ఎలా ఉన్నారన్నది చర్చగా మారింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమనే.. ప్రజలు ఏ పార్టీకైనా అధికారం అప్పగిస్తారు. దీనిలో ప్రజలకు కావా ల్సింది.. క్రెడిట్ చోరీ.. మరొకటా కాదు.. కేవలం కేపబిలిటీ ఆధారంగా రాష్ట్ర క్రెడిబిలిటీ(విశ్వసనీయత)ను పెంచడమే. అదే ఇప్పుడు జరుగుతోంది.
వైసీపీ నాయకులు చెబుతున్నట్టుగా జగన్ కు ఎంత క్రెడిబిలిటీ ఉన్నా.. ఎంత కేపబిలిటీ ఉన్నా.. ఏపీని దేశంలో తిట్టుకునే స్థాయికి.. ఏపీ రాజధాని ఏది ? అంటే.. దిక్కులు చూసే పరిస్థితికి తీసుకురావడం సరైన చర్యా? అనేది కీలకం. ఓకే.. చంద్రబాబు ఏమీ చేయడం లేదని అనుకున్నా.. ఆయన కారణంగా.. ఏపీ ఇప్పుడు రోడ్డున పడలేదే!. గతంలో నడిరోడ్డుపై డాక్టర్‌ను అరెస్టు చేసినట్టు.. శవాన్ని ఓ ప్రజాప్రతినిధి డోర్ డెలివరీ చేసినట్టు.. ప్రజాప్రతినిధులు సభల్లో బండబూతులు తిట్టినట్టు ఇప్పుడు జరగడం లేదుకదా!!. సో.. క్రెడిబిలిటీ.. అంటే. రాష్ట్రం పరువు దేశ వ్యాప్తంగా నిలబెట్టడమే తప్ప.. పథకాల అమలు.. ప్రాజెక్టుల అమలు అనేవి తర్వాత మాట. అవి ఎవరు అధికారంలో ఉన్నా.. చేస్తారు.