వధువు కావలెను... పండుగ వేళ ఫ్లెక్సీ వైరల్!

పండుగలు, పుట్టిన రోజు వేడుకలు తదితర కార్యక్రమాల సందర్భంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారనేది తెలిసిన విషయమే.;

Update: 2026-01-19 12:51 GMT

పండుగలు, పుట్టిన రోజు వేడుకలు తదితర కార్యక్రమాల సందర్భంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారనేది తెలిసిన విషయమే. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆ ఫ్లెక్సీలలో కొంతమంది ఫోటోలు దర్శనమిస్తాయి. అయితే.. ఫ్లెక్సీ లందు ఈ ఫ్లెక్సీ వేరయా అన్నట్లుగా నిలిచింది. ఓ గ్రామంలోని యువకులు పెట్టిన ఫ్లెక్సీ. ఈ ఫ్లెక్సీలో వారు పొందుపరిచిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కలికిరిపల్లెలో పశువుల పండగ సందర్భంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అవును... చిత్తురు జిల్లాలోని కలికిరిపల్లెలో పశువుల పండుగ సందర్భంగా యువత ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్లెక్సీతో గ్రామానికి చెందిన యువత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే ఫ్లెక్సీలో పెళ్లిళ్లు కానీ యువకుల ఫోటోలను కూడా ముద్రించి, ఆ యువకుల ఫోటోలకు స్టార్ గుర్తులు పెట్టారు. స్టార్ గుర్తులు పెట్టిన యువకులకు వధువులు కావలెను అని వినూత్న సందేశాన్ని ముద్రించారు. దీంతో ఈ ఫ్లెక్సీ అటు ఆఫ్ లైన్ లోనూ, ఇటు ఆన్ లైన్ లోనూ వైరల్ గా మారింది.

ప్రధానంగా ఆ పశువుల పండుగకు వచ్చిన వారికి ఈ ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ నేపథ్యంలో.. ఇక పండుగకు గ్రామానికి వచ్చిన వారు ఈ ఫ్లెక్సీని, చూసి ఆసక్తిగా తిలకించడంతోపాటు.. దాన్ని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో... అది కాస్త వైరల్ గా మారింది. ఈ సందర్భంగా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క ఆ గ్రామంలోని యువత పడుతున్న ఇబ్బందులకు ఈ ఫ్లెక్సీ సాక్ష్యంగా నిలుస్తుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

మరికొంతమంది మాత్రం... వచ్చే సంక్రాంతి నాటికి ఆ స్టార్ గుర్తులున్న యువకులు ఓ ఇంటి వాళ్లు అయిపోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నారు. కాగా... దేశంలో పెళ్లి కాని యువకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల వల్లో, అమ్మాయిలు దొరక్కో, కెరీర్ కే తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్లో.. కారణాలు ఏవైనా.. దేశంలో యువతకు సరైన వయసులో వివాహాలు జరగడం లేదని.. దీంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుందని అంటున్నారు!

Tags:    

Similar News