పుస్తకం పట్టుకోనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏం చదవబోతున్నారంటే?

రాజకీయాల్లో అధికారం గమ్యం కాదు.. అది నిరంతర పరీక్ష. ప్రతి రోజు కొత్త సమస్య, ప్రతి క్షణం కొత్త సవాల్‌.;

Update: 2026-01-19 12:34 GMT

రాజకీయాల్లో అధికారం గమ్యం కాదు.. అది నిరంతర పరీక్ష. ప్రతి రోజు కొత్త సమస్య, ప్రతి క్షణం కొత్త సవాల్‌. అలాంటి పరీక్షల మధ్య నిలబడి ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే అనుభవంతో పాటు నేర్చుకునే తపన కూడా అవసరం. ఈ తపనకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలనలో బిజీగా ఉండే ముఖ్యమంత్రి ఇప్పుడు పుస్తకం, పెన్ను చేతబట్టి.. విద్యార్థిగా మారేందుకు సిద్ధమవుతున్నారు.

మెరుగైన పాలన కోసం అవసరం అంటున్న సీఎం..

ఇటీవల తాను ఒక్క రోజు సెలవు కూడా తీసుకోలేని స్థాయిలో పని ఒత్తిడిలో ఉన్నానని చెప్పిన రేవంత్ రెడ్డి, అదే సమయంలో ‘మరింత మెరుగైన పాలన కోసం నేర్చుకోవడం అవసరం’ అన్న ఆలోచనతో ముందడుగు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అధికారంలో ఉన్న నాయకులు సాధారణంగా పాలన అనుభవాన్నే తమ బలంగా చూపిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అనుభవానికి తోడు విద్యను కూడా ఆయుధంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించనున్న ఐదు రోజుల షార్ట్‌టర్మ్ కోర్సులో ఆయన పాల్గొననున్నారు. లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ అనే పేరుతో నిర్వహించే ఈ కోర్సు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 150 మందికే అవకాశం కల్పించిన ఈ ప్రోగ్రామ్‌లో తెలంగాణ సీఎం ఎంపిక కావడం విశేషంగా చెప్పుకోవాలి.

హోం వర్క్ అసైన్ మెంట్లు తప్పనిసరి

ఈ కోర్సు సాధారణ లెక్చర్లకే పరిమితం కాదు. హోమ్‌వర్క్, అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్ అన్నీ తప్పనిసరి. అంటే, ముఖ్యమంత్రి అయినా సరే.. క్లాస్‌ అటెండ్ కావాలి, పనులు పూర్తి చేయాలి, ఆలోచనలను పేపర్ మీద పెట్టాలి. ఈ కోర్సులో 20 దేశాలకు చెందిన నిపుణులు బోధన చేయనుండగా, ఆధునిక నాయకత్వ లక్షణాలు, పాలనలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మారుతున్న పాత్రలు వంటి అంశాలపై లోతైన చర్చ జరగనుంది. ఈ ఐదు రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అధికారిక సర్టిఫికేషన్ కూడా లభిస్తుంది. అయితే ఇక్కడ సర్టిఫికెట్ కంటే ముఖ్యమైనది… ఆ కోర్సు ద్వారా పొందే ఆలోచనా విధానం. 21వ శతాబ్దంలో నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు; వినడం, అర్థం చేసుకోవడం, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం—ఇవన్నీ కీలక అంశాలుగా మారాయి. ఈ మార్పులను అర్థం చేసుకునేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందనే అంచనా వ్యక్తమవుతోంది.

ఈ కోర్సు చేసే తొలి ముఖ్యమంత్రిగా రికార్డు..

ఇక రాజకీయంగా చూస్తే.., అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఐవీ లీగ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు చేయడం తొలిసారి. ఇది సహజంగానే ప్రశంసలతో పాటు విమర్శలకు కూడా దారితీసే అవకాశం లేకపోలేదు. కొందరు ‘పాలన ఇక్కడ వదిలేసి కోర్సులేమిటి?’ అని ప్రశ్నిస్తే, మరికొందరు ‘నాయకుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే అదే నిజమైన బలం’ అని అభిప్రాయపడుతున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టం ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి తనను తాను నిరంతరం అప్డేట్ చేసుకునే నాయకుడిగా చూపించాలనుకుంటున్నారు.

భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న పార్టీ వర్గాలు..

పార్టీ వర్గాల మాటల్లో చెప్పాలంటే, ఈ కోర్సు ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత సమర్థవంతమైన, ఆధునిక పాలన అందించడమే లక్ష్యంగా భావిస్తున్నారు. పాలనలో ఎదురయ్యే సమస్యలను కేస్ స్టడీలుగా విశ్లేషించడం, ప్రపంచంలోని ఇతర దేశాలు అనుసరిస్తున్న మోడళ్లను అధ్యయనం చేయడం, వాటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడం ఇలాంటి అంశాలపై ఈ శిక్షణ దృష్టి సారించనుంది. అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోవడం ఆపేయడం సులభం. కానీ నేర్చుకోవడాన్ని కొనసాగించడమే నిజమైన నాయకత్వ లక్షణం. ‘పాలన కోసం పుస్తకం’ పట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఇస్తున్న సందేశం ఇదే పదవి ఎంత పెద్దదైనా, ప్రజల కోసం నేర్చుకోవడం ఎప్పుడూ చిన్న పని కాదు.

Tags:    

Similar News