తెలంగాణలో మంత్రుల పంచాయతీ వెనుక.. కారణం ఇదేనా?
మంత్రులపై ఆరోపణలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మీడియా సంస్థలకు సూచనలు చేస్తూ, నిరాధార ఆరోపణలు చేయొద్దని, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.;
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం పనితీరుపై విమర్శలు, మరోవైపు మంత్రులపై వస్తున్న ఆరోపణలు, వాటికి కొనసాగుతున్న ఖండనలు.. ఇవన్నీ కలిసివచ్చి రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. వారం రోజులుగా మంత్రులపై మీడియా కథనాలు రావడం, వాటిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ వెంటనే ప్రతిపక్షం నుంచి తీవ్రమైన ఎదురుదాడి మొదలవడం ఇవన్నీ పరిశీలిస్తే ఇది సాధారణ రాజకీయ విమర్శల దశను దాటి, అధికార వ్యవస్థ లోపలి విభేదాలపై అనుమానాలు పెరిగే స్థాయికి చేరినట్టు కనిపిస్తోంది.
సీరియస్ గా తీసుకోనున్న రేవంత్..
మంత్రులపై ఆరోపణలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మీడియా సంస్థలకు సూచనలు చేస్తూ, నిరాధార ఆరోపణలు చేయొద్దని, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. కానీ కేవలం ఈ వ్యాఖ్యలతోనే విషయం చల్లారలేదు. అదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త దుమారాన్ని రేపాయి. ఆయన చేసిన ఆరోపణలు కేవలం వ్యక్తిగత విమర్శలుగా కాకుండా, ప్రభుత్వంలోని కీలక మంత్రుల మధ్య జరుగుతున్న అంతర్గత పంచాయితీలపై ప్రశ్నలు సంధించినట్టుగా ఉన్నాయి. హరీష్ రావు చేసిన ఆరోపణల్లో ప్రధానంగా సింగరేణి టెండర్లు, మేడారం పనులు, మద్యం హోలోగ్రామ్ టెండర్లు, ప్రివ్యూ షో రేట్ల పెంపు వంటి అంశాలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మధ్య వాటాల పంచాయితీలు జరుగుతున్నాయంటూ ఆయన బహిరంగంగా ప్రశ్నించడం రాజకీయంగా సంచలనమే. ‘అందుకే ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులను బలి పశువులను చేస్తున్నారు’ అన్న వ్యాఖ్యలు ప్రభుత్వంపై నైతిక ఒత్తిడి పెంచేలా ఉన్నాయి.
అభివృద్ధి పనుల్లోనూ విభేదాలు..
మేడారం టెండర్ల విషయంలోనూ, మద్యం హోలోగ్రామ్ టెండర్లలోనూ మంత్రుల మధ్య విభేదాలు లేవా? అంటూ హరీష్ అడిగిన ప్రశ్నలు, అధికార వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్ష నేతలపై, జర్నలిస్టులపై సిట్‌లు వేస్తున్న ప్రభుత్వం.. మరి ఈ ఆరోపణలపై ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీయడం, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపే ప్రయత్నంగా కనిపిస్తోంది. సీఎంకు తెలియకుండా సిట్‌లు వేస్తున్నారని చెబితే, అది నాయకత్వ వైఫల్యమే కాదా? అన్న ప్రశ్న కూడా రాజకీయంగా బలంగా వినిపిస్తోంది.
6 గ్యారంటీలపై విమర్శలు ఎదుర్కొంటున్న అమాత్యులు
ఇక్కడ మరో కీలక అంశం ఈ విమర్శల వెనుక దాగి ఉన్న రాజకీయ వ్యూహం. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు ఎదుర్కొంటోంది. రైతుబంధు, ఎరువులు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలు కేబినెట్‌లోనే ప్రాధాన్యం దక్కించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సీఎం ఆటలాడుకుంటున్నారు’ అన్న హరీష్ వ్యాఖ్యలు, ప్రభుత్వ పాలనపై భావోద్వేగ కోణంలో దాడి చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో చరిత్రను తెరపైకి తీసుకొస్తూ, రాజీవ్ గాంధీ–అంజయ్య ఉదంతం, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం వంటి విషయాలను ప్రస్తావించడం ద్వారా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భావోద్వేగాలను రగిలించే ప్రయత్నం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఎన్టీఆర్‌కు మనశ్శాంతి కలగాలంటే కాంగ్రెస్ భూస్థాపితం కావాలి’ అన్న వ్యాఖ్యలు, రాజకీయ విమర్శల కంటే ఎక్కువగా ప్రతీకార రాజకీయాల దిశగా వెళ్లుతున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
మొత్తానికి, మంత్రుల మధ్య పంచాయితీ అంశం ఇప్పుడు రాజకీయ ఆరోపణల స్థాయిలోనే ఉన్నా, వాటికి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందన్నదే కీలకం. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే, ఇవి కేవలం ప్రతిపక్ష విమర్శలుగా కాకుండా, ప్రజల మనసుల్లో అనుమానాలుగా మారే ప్రమాదం ఉంది. అధికారంలో ఉన్నవారు పారదర్శకతను చూపించగలిగితేనే ఈ రాజకీయ దుమారం తగ్గుతుంది. లేదంటే, ఈ పంచాయితీలు రేపటి రాజకీయాల్లో పెద్ద యుద్ధాలకు నాంది పలికే అవకాశం కూడా ఉందన్న భావన బలపడుతోంది.