దావోస్ పర్యటన అసలు ఉద్దేశ్యం క్లియర్ గా చెప్పిన లోకేష్!

ఏపీ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిక్‌ చేరుకున్నారు. ఈ సమయంలో.. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్‌.ఆర్‌.ఐ టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు.;

Update: 2026-01-19 12:05 GMT

ఏపీ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిక్‌ చేరుకున్నారు. ఈ సమయంలో.. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్‌.ఆర్‌.ఐ టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ అక్కడి నుంచి దావోస్‌ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ని నమ్మకమైన గ్లోబల్‌ గమ్యంగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. ఈ పర్యటన అసలు ఉద్దేశ్యాన్ని క్లియర్ గా చెప్పారు.

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కార్యక్రమంలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌ కు రెగ్యులర్ గా వెళ్లేవారనే సంగతి తెలిసిందే. 90వ దశకంలోనే భారత్‌ కు తొలి గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్లలో సీఎం చంద్రబాబు ఒకరుగా ఉండేవారు! ఈ క్రమంలో.. ఇటీవలి కాలంలో ఆయన కుమారుడు, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఆయనతో పాటు వస్తున్నారు.. ఈ క్రమంలో... దావోస్ పర్యటనలపై ఆసక్తికరమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇందులో భాగంగా... దావోస్ కేవలం అవగాహన ఒప్పందాల(ఎంవోయూ)పై సంతకం చేయడం గురించి కాదని.. వ్యాపారం, సాంకేతికత, విధానం ఎక్కడికి సారధ్యం వహిస్తాయో అర్థం చేసుకోవడం గురించని.. సంబంధాలు నిర్మించబడేది, అంచనాలను పరీక్షించబడేది, సరైన ప్రశ్నలు అడగబడేది ఇక్కడే అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దావోస్ 2026లోకి అడుగుపెడుతున్నప్పుడు ఇది తన ధృక్పథం అని బిజినెస్ లైన్ కి రాసిన ఆర్టికల్ ను ఆయన జతచేశారు.

ఇదే సమయంలో... ఈ దావోస్ పర్యటనలు టెక్ పరిశ్రమలో మారుతున్న ధోరణుల గురించి పరిపాలనకు స్పష్టమైన దృక్పథాన్ని అందిస్తాయని.. వ్యాపార అధిపతులను కొన్ని కఠినమైన ప్రశ్నలు అడగవచ్చని ఐటీ మంత్రి తెలిపారు. వైజాగ్‌ లో ఇటీవలి గూగుల్ మెగా పెట్టుబడి కూడా 2025లో దావోస్‌ లో జరిగిన అధికారిక సంభాషణతో ప్రారంభమైందని.. ఇది కార్యరూపం దాల్చడానికి, పురోగతికి దారితీసిందని ఆయన జతచేశారు!

కాగా... ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లింది. రాత్రి 1:45 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు జ్యూరిక్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం 2:30కి జ్యూరిక్‌ లోని స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్‌ కుమార్‌.. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ ఉంటుంది!

సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిక్‌ లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొని తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం.. జ్యూరిక్‌ నుంచి రోడ్డుమార్గంలో దావోస్‌ కు వెళ్తారు. దావోస్‌ లో తొలిరోజు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆర్థిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రితో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు.

Tags:    

Similar News