ముంబై మేయర్ పీఠం ఆ పార్టీకే.. ఎవరు మేయర్ కాబోతున్నారంటే?
మరోవైపు చూస్తే, శివసేన (UBT) 65 సీట్లు సాధించింది. ఒకప్పుడు ముంబై రాజకీయాలకు కింగ్‌మేకర్‌గా ఉన్న శివసేనకు ఇది ఒక రకమైన ఎదురుదెబ్బగానే చెప్పాలి.;
ముంబై రాజకీయాల్లో మరో కీలక ఘట్టం దగ్గరపడుతోంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు.. సామాన్యుల్లో కూడా ఉత్కంఠను రేపుతోంది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల తర్వాత ఏర్పడిన సంఖ్యాబలం, కూటముల లెక్కలు చూస్తే.. ఈసారి మేయర్ పీఠం దిశగా భారతీయ జనతా పార్టీ గట్టి అడుగులు వేస్తోంది అనే భావన బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒంటరిగా బీజేపీ 89 సీట్లు సాధించగా, దానికి మద్దతుగా ఉన్న శివసేన కూటమి (ఏక్నాథ్ షిండే వర్గం) 29 సీట్లు గెలుచుకుంది. ఈ రెండు కలిస్తే మొత్తం 118 సీట్లు అవుతున్నాయి. సాధారణ మెజారిటీ మార్కును దాటిన ఈ సంఖ్యాబలం.. మేయర్ పీఠంపై తమ హక్కును బీజేపీ గట్టిగా వినిపించేలా చేస్తోంది.
శివసేనుకు ఎదురుదెబ్బనే..
మరోవైపు చూస్తే, శివసేన (UBT) 65 సీట్లు సాధించింది. ఒకప్పుడు ముంబై రాజకీయాలకు కింగ్‌మేకర్‌గా ఉన్న శివసేనకు ఇది ఒక రకమైన ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాంగ్రెస్ కూటమి 24 సీట్లకే పరిమితమవ్వగా, ఎంఎన్ఎస్ 6, ఎఐఎంఐఎం 8 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన చోట్ల ఇతర స్వతంత్రులు, చిన్న పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విభజిత ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే.. ఎవరూ ఒంటరిగా మేయర్‌ను ఎన్నుకునే స్థాయిలో లేరు. కానీ బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రం స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 28న జరగనున్న కౌన్సిలర్ల సమావేశం ఇప్పుడు అసలైన రాజకీయ హీట్‌ను పెంచుతోంది. ఈ సమావేశంలోనే మేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. సంఖ్యాబలం బీజేపీకి అనుకూలంగా ఉన్నా.. ముంబై రాజకీయాలు ఎప్పుడూ సూటిగా సాగవన్నది గత అనుభవం. చివరి నిమిషంలో మారే మద్దతులు, అంతర్గత ఒప్పందాలు, వ్యూహాత్మక ఓట్లు ఇవన్నీ ఫలితాన్ని తారుమారు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.
దశాబ్దాల దూరానికి తెర..
మేయర్ పీఠం బీజేపీకి దక్కితే, అది కేవలం ఒక మున్సిపల్ విజయం మాత్రమే కాదు. దశాబ్దాలుగా ముంబై కార్పొరేషన్‌పై శివసేన ఆధిపత్యం కొనసాగింది. ఆ కోటను బద్దలు కొట్టడం అంటే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తిసమీకరణలు పూర్తిగా మారుతున్నాయన్న సంకేతం బలంగా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే అధికారం బీజేపీ-శివసేన (షిండే వర్గం) చేతుల్లో ఉండగా, ముంబై మేయర్ పీఠం కూడా అదే కూటమి చేతికి వెళ్తే.. బీజేపీకి ఇది ఒక ‘సూపర్ పాలిటికల్ బూస్ట్’గా మారనుంది. అయితే మరో కోణం కూడా ఉంది. బీజేపీకి మేయర్ దక్కితే, ముంబై పాలనపై అంచనాలు కూడా భారీగా పెరుగుతాయి. దేశంలోని అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన BMC (బొంబాయ్ మున్సిపల్ కార్పొరేషన్) మౌలిక వసతులు, డ్రైనేజీ, వరదల నివారణ, రోడ్లు, హౌసింగ్ వంటి అంశాల్లో తరచూ విమర్శలు ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలకు పరిష్కారాలు చూపించలేకపోతే, అదే విజయం భవిష్యత్తులో భారంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ప్రతిపక్షాల వ్యూహం ఏంటన్నది కూడా ఆసక్తికరం. శివసేన (UBT), కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలు కలిసి ఒక ప్రత్యామ్నాయ సమీకరణకు ప్రయత్నిస్తాయా? లేక సంఖ్యాబలం లేదని భావించి రాజకీయ పోరును రాబోయే అసెంబ్లీ ఎన్నికల దిశగా మళ్లిస్తాయా? అన్నది 28వ తేదీకి ముందే స్పష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా ముంబై మేయర్ పీఠం చుట్టూ నడుస్తున్న ఈ ఉత్కంఠ కేవలం స్థానిక రాజకీయాల వరకే పరిమితం కాదు. ఇది మహారాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును సూచించే కీలక సంకేతంగా మారుతోంది. 28న జరిగే కౌన్సిలర్ల మీటింగ్ తర్వాత ముంబై పాలనలో కొత్త అధ్యాయం మొదలవుతుందా? లేక చివరి నిమిషంలో మరో రాజకీయ ట్విస్ట్ వస్తుందా? అన్నది చూడాలి. ఇప్పటివరకు మాత్రం.. గాలి దిశ బీజేపీ వైపే వీస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం