మహిళలు ఏం దుస్తులు వేసుకోవాలో మీరేంటి చెప్పేది.. రేణుకా చౌదరి సీరియస్

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-01-19 12:49 GMT

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మోదీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన గెలుపును ఆపే దమ్ము కేటీఆర్ కు ఉందా అంటూ సవాల్ విసిరారు.

ఇటీవల మహిళల దుస్తులపై జరుగుతున్న వివాదంపై కూడా రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. “మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరు ఎవరు?” అని ప్రశ్నించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అణగదొక్కాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితం నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు, వాటికి సినీ నటి అనసూయ స్పందించడంతో ఈ అంశం పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల విషయంలో తప్పుడు వార్తలు రాయడం ఏమాత్రం మంచిది కాదని రేణుకా చౌదరి హితవు పలికారు. మీడియా, సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు

జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, అమలులో కోతలపై స్పందించిన ఆమె ఈ పథకం ద్వారా కోట్లాది పేదలకు ఉపాధి లభిస్తోందని, దాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

మొత్తంగా మహిళల గౌరవం, పేదల హక్కులు, ప్రజాస్వామ్య విలువల విషయంలో రాజీ పడేది లేదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఖమ్మం రాజకీయాల్లో ఈసారి తానే ప్రధాన పాత్ర పోషిస్తానని, ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News