మిధున్ రెడ్డి తర్వాత అరెస్టు ఎవరు ?

ఏపీలో లిక్కర్ స్కాం సంచలనాలు రేపుతోంది. కేవలం మూడు నెలల తేడాలో ఏకంగా 12 మందిని అరెస్టు చేశారు అంటే ఈ కేసులో సిట్ దూకుడు అర్ధం అవుతోంది.;

Update: 2025-07-19 17:31 GMT

ఏపీలో లిక్కర్ స్కాం సంచలనాలు రేపుతోంది. కేవలం మూడు నెలల తేడాలో ఏకంగా 12 మందిని అరెస్టు చేశారు అంటే ఈ కేసులో సిట్ దూకుడు అర్ధం అవుతోంది. అలాగే 62 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశారు అని అంటున్నారు. ఈ లిక్కర్ స్కాం లో బిగ్ షాట్స్ ఉన్నారని సిట్ మొదటి నుంచి అనుమానిస్తూ ఆ దిశగా విచారణ జరుపుతోంది.

ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించారు. అయితే ఆ ఫ్రేమింగ్ అంతా చూసింది మిధున్ రెడ్డి అని సిట్ ఆధారాలతో సహా వెల్లడిస్తోంది. ఆయన రూపకల్పన కాబట్టి ఆయనే అతి ముఖ్యుడిగా భావించి చాలా కాలం క్రితమే ఆయనను అరెస్టు చేయాలని చూసింది. గతంలో ఒకసారి విచారణకు పిలిచింది. అయితే ముందస్తు బెయిల్ తీసుకున్నందువల్ల ఆయన అప్పట్లో విచారణ తర్వాత బయటకు వచ్చారు.

ఈసారి మాత్రం అరెస్టు అయ్యారు. ఈ విషయం ముందే తెలిసినట్లుగానే ఆయన వ్యాఖ్యానించారు. తన అరెస్టుకు రంగం సిద్ధం అవుతోందని కూడా చెప్పారు. ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన కేసు అని ఇబ్బంది పెట్టేందుకే అని మిధున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కేసులో తనను అరెస్టు చేసినా అది కోర్టులో నిలబడదని ఆయన అంటూ వచ్చారు.

మొత్తం మీద మిధున్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఆయన వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడు అన్నది తెలిసిందే. దాంతో ఈ కేసులో మిధును అరెస్టు తరువాత తరువాత ఎవరి అరెస్టు ఉంటుంది అన్నది చర్చగా ఉంది. లిక్కర్ స్కాం లో సిట్ విచారణలో ఇప్పటిదాకా అరెస్టు అయిన వారు వేరు మిధున్ రెడ్డి అరెస్టుతో బిగ్ షాట్ ని టచ్ చేసినట్లు అయింది. ఇక ముందు మరిన్ని సంచలన అరెస్టులకు మిధున్ రెడ్డి అరెస్టు నాంది కాబోతోందా అన్న చర్చ కూడా నడుస్తోంది.

మద్యం దుకాణాలలో ఆన్ లైన్ లేకుండా కరెన్సీ ద్వారా తీసుకున్నట్లుగా సిట్ మొదట గుర్తించి ఈ స్కాం మూలాధారాలు లోకి వెళ్ళింది అని అంటున్నారు. పది రూపాయలకు కూడా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న కాలంలో కేవలం నగదు చెల్లింపులు ఎందుకు చేశారు అన్న తీగను పట్టుకుని డొంకను లాగారని అంటున్నారు. ఇక ఈ కేసులో మూడు వందలకు పేజీలతో చార్జిషీటుని రూపొందించారని అంటున్నారు.

ఈ కేసులో పూర్తి చార్జి షీటుని కేవలం ఇరవై రోజులలో వేసి విచారణ పూర్తి చేస్తారు అని అంటున్నారు. మరి ఈ ఇరవై రోజులలో కీలకమైన మరిన్ని అరెస్టులు జరుగుతాయా అన్నదే చర్చకు వస్తోంది. మిధున్ రెడ్డి అరెస్టుతో ఇక జగన్ మీద కూడా సిట్ ఫోకస్ ఉంటుందా అన్నది కూడా హాట్ టాపిక్ గా ఉంది. ఈ కేసులో అంతిమ లబ్దిదారులు ఎవరు అన్న దాని మీద లోతైన దర్యాప్తు చేస్తూ సిట్ అనేక ముఖ్యమైన ఆధారాలను సమకూర్చుకుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ కి అత్యంత సన్నిహితులు గా ఉన్న వారిని అందరికీ అరెస్టు చేశారు కసిరెడ్డి రాజశేఖర్ తో పాటు ధనుజయ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక ఎంపీని అరెస్టు చేయడం అంటే ఆషామాషీ కాదని అంటున్నారు. అనేక కీలకమైన ఆధారాలు చూసుకున్న మీదటనే మిధున్ రెడ్డి అరెస్టు చేసింది అని అంటునారు.

ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయన్నది సిట్ గుర్తించింది. కానీ ఎవరెవరికి ఈ ముడుపులు వెళ్ళాయని కూడా సిట్ విచారిస్తోంది. సిట్ ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. అరెస్టు అయిన వారందరికీ ఈ స్కాం లో సంబంధం ఉందని సిట్ గట్టిగా భావిస్తోంది.

ఇక ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగుతుందా అన్నది చర్చగా ఉంది. సిట్ కాదు ఈడీ మరింత పవర్ ఫుల్ అన్నది తెలిసిందే. ఈడీ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు. రాజ్ కసిరెడ్డిని పట్టుకుని అరెస్టు చేసిన తరువాతనే ఈ కేసులో డొంక కదిలింది అని అంటున్నారు. వరసగా క్రిష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా అనేక మంది అరెస్టులు సిట్ చేసింది అని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ కేసులో ఆధారాలు లేవు అని అంటోంది. మరి తరువాత అరెస్టులు ఎవరిది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News