జగన్ కి దగ్గరుండి క్రేజ్ పెంచుతున్నారా ?
ఇక ఏపీ రాజకీయాల్లో చూస్తే పైసా ఖర్చు లేకుండా జగన్ కి ప్రచారం చేసి పెడుతున్న వైనం కనిపిస్తోంది.;
పురాణాలలో జయ విజయుల కధ ఉంటుంది దేవుడికి శత్రువులుగా ఉంటూ వారు మోక్షం పొందుతారు ఎందుకంటే నిరంతరం వారు చేసేది దైవ దూషణ పేరుతో ఆయన ధ్యానమే. అలా పరమ భక్తుల కంటే వారే ఎక్కువగా నామస్మరణ చేస్తారన్న మాట.
ఇక ఏపీ రాజకీయాల్లో చూస్తే పైసా ఖర్చు లేకుండా జగన్ కి ప్రచారం చేసి పెడుతున్న వైనం కనిపిస్తోంది. జగన్ నెలలో ఒకటి రెండు జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు. సహజంగానే వైసీపీకి రాజకీయ వ్యూహాలు ఉంటాయి. తమ పార్టీ తరఫున అన్ని లెక్కలూ వేసుకుని మరీ తాము పొలిటీకల్ గా హైలెట్ కావాలని తమ అధినేత టూర్ సక్సెస్ కావాలని లెక్కలేసుకునే పర్యటనలు చేస్తారు.
అలాంటి సమయంలో వారికి కూటమి వైపు నుంచి ఆంక్షల పేరుతో మరింతగా ఫోకస్ వస్తోందా అన్న చర్చ సాగుతోంది. మామూలుగా అయితే జగన్ ఒక జిల్లాకు వెళ్ళి వస్తారు. అక్కడ సమస్యల మీద మాట్లాడుతారు, వారి పార్టీ నాయకులు క్యాడర్ పాల్గొంటారు. అది అక్కడితో ఒక రోజుతో ముగిసే కార్యక్రమం. కానీ కూటమి ప్రభుత్వం తీరు చూస్తే అలా ఒక రోజుతో ముగించే విధంగా లేదనిపిస్తోంది.
ఒక జిల్లాకు జగన్ వెళ్లాలని అనుకున్నపుడు ముందుగా అనుమతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని మీద వైసీపీ నేతల రెట్టింపులు, వారు మీడియా మీట్లు అవతల వైపు కూటమి నుంచి వరస విమర్శలు ఇలా ఇవన్నీ కూడా వైసీపీ క్యాడర్ లో కసిని మరింతగా పెంచేస్తున్నాయి. ఇక అడుగడుగునా ఆంక్షలు పెట్టడం వల్ల కూడా ఫుల్ అటెన్షన్ ఆ వైపు గా మళ్ళుతుంది. జగన్ టూర్ కి వచ్చే రోజు ఏమి జరుగుతుంది అన్నది కూడా ఏపీ జనం మొత్తం దృష్టి పెట్టేలా చేస్తోంది.
లేకపోతే ఒక పార్టీ అధినేత వస్తున్నారు అంటే పది మందినే హెలిపాడ్ కి రమ్మనడం, అయిదు వందల మంది కంటే ఎక్కువగా జనాలు రావద్దు అనడం అడుగడునా చెక్ పోస్టులు పెట్టడం ముందస్తుగా సన్నాహాలు చేయడం బంబోబస్తుకు వందల సంఖ్యలో పోలీసులను పెట్టడం ఇవన్నీ చూతే సగటు జనాలకు ఉత్కంఠంగా ఉండదా మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అన్నదే చర్చగా ఉంది.
అంతే కాదు జగన్ సభలకు జనాలు తలరిస్తారో లేక తోలుకు వస్తారో లేక ఏమి చేస్తారో ఆ పార్టీ ఇష్టం. వారి మానాన వదిలేస్తే అపుడు అది వైసీపీ సొంత రాజకీయ బాధ అవుతుంది కదా అని అంటున్నారు. కానీ దానిని చిరిగి చేటను చేయడం ద్వారా అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ తరహా పర్యటనకు చేస్తేనే ఎవరైనా సూపర్ హిట్ అయిపోతారు అనుకోవడమూ పొరపాటే.
అధికారంలో ఉన్న వారికి ఆ విషయాలూ తెలుసు. అంతే కాదు ప్రభుత్వం ఎన్ని చేసినా చేయనివి ఉంటాయి. ప్రజలలో అసంతృప్తి సమస్యలు ఉంటాయి. అంతా బాగుంది అనుకుంటే కుదరదు, వాటిని కూడా పాజిటివ్ గా తీసుకుంటే పోయేదేముంది అంటున్నారు. అంతే కాదు, విపక్షాలు ఎన్ని చేసినా విమర్శిస్తూ ఉంటాయి. అలా లైట్ తీసుకున్నా తప్పు లేదు.
కానీ మీరు రావద్దు పోవద్దు అని అంటేనే సమస్య వస్తుంది. మానవ మనస్తత్వం ప్రకారం వద్దు అన్న చోటనే ఒత్తిడి ఉంటుంది. అటే అంతా చూడాలని ఉంటుంది ఇపుడు ఏపీలో జరుగుతున్నది అదే. మొత్తానికి 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశామని చెబుతూనే గత ఏడాదిగా కూటమి పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు విధానాల కారణంగానే జగన్ కి కానీ వైసీపీ కానీ హైప్ క్రియేట్ అవుతోంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అన్న చర్చకు కూడా ఈ తరహా ఆంక్షలు నియంత్రణలే కారణం అవుతాయన్నది కాస్తా ఆలోచిస్తే బెటరేమో అన్న సూచనలు వస్తున్నాయి.